మైసూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్, జేడీఎస్ లను తీవ్రంగా విమర్శించారు మోడీ. కర్ణాటకను ఆ పార్టీలు దోచుకున్నాయని మోడీ విరుచుకుపడ్డారు. కర్ణాటకను వారు ఏటీఎంలా చూశారంటూ విమర్శించారు! రాజకీయ అవినీతి, వారసత్వ పార్టీలు అంటూ ఆ పార్టీలపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు.
కర్ణాటకలో మోడీకి ఇది ఐదో ర్యాలీ. ఇక్కడ పార్టీని గెలిపించడానికి మోడీ చాలా కష్టపడుతున్నారు. దాదాపు నెల రోజుల సమయం వెచ్చించి మోడీ ఇక్కడ ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ పార్టీ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి, కర్ణాటక బీజేపీ చీఫ్ అంటూ ఎవ్వరి పేరు లేకుండా అంతా మోడీ పేరు మీదనే బీజేపీ రాజకీయం సాగుతూ ఉంది. కర్ణాటకలో బీజేపీకి అధికారాన్ని ఇస్తే ఎవ్వరిని సీఎం చేస్తారనే అంశంపై కూడా బీజేపీ చెప్పడం లేదు. మోడీని చూసి ఓటేయాలన్నట్టుగా మాత్రమే ప్రచారం సాగుతూ ఉంది.
మరి తమ రాజకీయ ప్రత్యర్థులపై అవినీతి అంటూ అస్త్రాలను సంధిస్తున్న మోడీజీ, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలా ఏర్పరిచారు, ఎమ్మెల్యేలు ఊరికే ఉచితంగా, డబ్బులు తీసుకోకుండా బీజేపీకి మద్దతు పలికారా.. ఇవన్నీ ప్రజలకు తెలియని అంశాలు అని, బీజేపీ అవినీతి రాహిత్యం అంటూ నమ్ముతున్నారని భ్రమపడుతున్నట్టుగా ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. జేడీఎస్ పై మోడీ విరుచుకుపడ్డారు. ఒక రేంజ్ లో! రాజకీయ వారసత్వం, అవినీతి అంటూ ఆ పార్టీని విమర్శించారు. మరి ఈ విమర్శలకు ఎక్స్ పైరీ డేట్ ఉన్నట్టా లేనట్టా! కర్ణాటకలో బీజేపీకి ఏ ఎనభై సీట్లో వచ్చి, జేడీఎస్ గనుక 30 సీట్ల వరకూ సాధిస్తే, కాంగ్రెస్ నుంచి ఏ పది మంది ఎమ్మెల్యేలనో ఇటుతిప్పుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదా? అలాంటి సమీకరణాల మధ్యన జేడీఎస్ తో బీజేపీ పాత స్నేహాన్నే మళ్లీ పరిమళింపజేయదా!
ఎట్టి పరిస్థితుల్లో అయినా జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటూ కమలం పార్టీ నేతలు కానీ, అక్కడ ప్రచారంలో అంతా తానే అవుతున్న ప్రధాని మోడీ గానీ చెప్పగలరా! ఆల్రెడీ జేడీఎస్ ను దువ్వుతున్నారని, ఆ మధ్య దేవేగౌడపై పొగడ్తల వాన కురిపించినప్పుడే విశ్లేషణలు వినిపించాయి. పోలింగ్ వరకూ ఇలాంటి విమర్శలు కొనసాగవచ్చు. అవసరం అయితే బీజేపీ-జేడీఎస్ లు కత్తులు పక్కన పెట్టి, వీటి మధ్యన పొత్తులు విచ్చుకునే అవకాశాలు మాత్రం పుష్కలమే!