రెజ్ల‌ర్ల నిర‌స‌స‌న‌..బీజేపీ ఎంపీ ప్ర‌క‌ట‌న‌.. షేమ్ షేమ్!

వాళ్లు ఒలింపిక్స్ లోనూ, ఇత‌ర అంత‌ర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్ లోనూ ప‌త‌కాలు సాధిస్తే.. దేశంలోని నెటిజ‌న్లంతా వారి ఫొటోల‌ను త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్స్ లోకి షేర్ చేసి పొంగిపోయారు! వారిని మీడియా ఒక…

వాళ్లు ఒలింపిక్స్ లోనూ, ఇత‌ర అంత‌ర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్ లోనూ ప‌త‌కాలు సాధిస్తే.. దేశంలోని నెటిజ‌న్లంతా వారి ఫొటోల‌ను త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్స్ లోకి షేర్ చేసి పొంగిపోయారు! వారిని మీడియా ఒక రేంజ్ లో కీర్తించింది. వారు సాధించిన ప‌త‌కాల‌ను తామంతా సాధించిన‌ట్టుగా భార‌తీయులు పొంగిపోయారు. 

నూటా న‌ల‌భై కోట్ల జ‌నాభా ఉన్న దేశంలో, ఒలింపిక్స్ ప‌త‌కాలు అపురూపం అయిన మ‌న‌దేశంలో.. రెజ్ల‌ర్లు గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో దేశం ప‌రువును ఎంతోకొంత నిల‌బెట్టారు. మ‌రి అలాంటి రెజ్ల‌ర్లు ఇప్పుడు తమ అసోసియేష‌న్ పెద్ద మ‌నిషి లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్నాడని రోడ్డెక్కితే మాత్రం దేశం కిక్కురుమ‌న‌డం లేదు!

ఆ మ‌హిళా రెజ్ల‌ర్లు ప‌త‌కాలు సాధించిన‌ప్పుడు వారిని అపురూపంగా చూసిన జ‌నాలు, వాళ్లే తాము లైంగిక వేధింపుల‌కు గుర‌వుతున్నాము, ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకునేవాడు లేడు.. స‌ద‌రు అసోసియేష‌న్ ప్రెసిడెంట్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ కూడా.. దీంతో త‌మ గోడును ప‌ట్టించుకునే నాథుడు లేడంటూ బైఠాయించినా ఫ‌లితం మాత్రం శూన్యం. వారు గెలిచిన‌ప్పుడు షేర్లు చేసిన వారు తాము దుర్మార్గుడి బారిన ప‌డ్డామ‌ని ఏడుస్తుంటే మాత్రం సోష‌ల్ మీడియా కూడా స్పందించ‌డం లేదు! జ‌నాలు ఇలా త‌యార‌య్యేరేమో మ‌రి.

బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్.. ఈయ‌న రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. ఇంకా యూపీ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ ఎంపీ. ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన ఈయ‌న యూపీ బీజేపీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రు. మ‌రి రాజ‌కీయ నేత‌లు ముదిరి స్పోర్ట్స్ అసోసియేష‌న్ల ప్రెసిడెంట్లుగా రాజ్యం చెలాయించే రోజులివి. బీసీసీఐ తో స‌హా ఇప్పుడు దేశంలో చాలా క్రీడా సంఘాలు క‌మ‌లం పార్టీ నేత‌ల జేబు సంస్థ‌ల్లా మారిపోయాయి. అవ‌న్నీ వార‌స‌త్వ రాజ‌కీయాలు కాదు, క్రీడా సంఘాల్లో ఒక‌దానికి పీటీ ఉష పేరు చెబుతూ, మిగతా సంఘాల వ్య‌వ‌హారాలు రోడ్డుకు ఎక్కినా ఏమైనా అంటే వారు దేశ‌ద్రోహులు, పాకిస్తాన్ కు వెళ్లిపోవాల్సిన వాళ్లు అయిపోతున్నారు!

ఒలింపియ‌న్లు అయిన రెజ్ల‌ర్లు రోజుల త‌ర‌బ‌డి నిర‌శ‌న కొన‌సాగిస్తున్నా.. కేంద్రం నుంచి స్పంద‌న ఏమీ లేదు! వాళ్లేం త‌మ‌కు డ‌బ్బులు కావాల‌నో, లేక ఉద్యోగాలు ఇవ్వాల‌నో, రైతుల్లా మ‌ద్ద‌తు ధ‌ర కోస‌మో ధ‌ర్నాకు దిగ‌లేదు. లైంగిక వేధింపులు అంటున్నారు! అది కూడా ఫెడ‌రేష‌న్ ప్రెసిడెంటు, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ మీద! ఇలాంట‌ప్పుడు చ‌ర్య‌లు వేగంగా ఉంటాయ‌ని ఎవ‌రైనా అనుకుంటారు. అయితే కేంద్రం కిమ్మ‌న‌డం లేదు. 

క‌నీసం విచార‌ణ సంఘం అనో కూడా ప్ర‌క‌టించ‌లేదు. జ‌స్ట్ ఒక ఎఫ్ఐఆర్ ను రిజిస్ట‌ర్ చేశార‌ట‌. అది కూడా ఇంత ర‌చ్చ త‌ర్వాత‌. ఈ అంశంపై స‌ద‌రు బ్రిజ్ భూష‌ణ్ కూడా స్పందించారు. ఇదంతా స‌మాజ్ వాదీ పార్టీ కుట్ర అని ఆయ‌న అంటున్నారు. యూపీలో చాలా మంది రెజ్ల‌ర్ల కుటుంబాలు ఎస్పీ మ‌ద్ద‌తుదారుల‌ట‌! 80 శాతం రెజ్ల‌ర్ల ప్యామిలీలు ఎస్పీ మ‌ద్ద‌తుదార్లు అని, అందుకే వారు త‌న‌పై రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు! మ‌రి ఈయ‌న‌పై రాద్ధాంతం చేయాలంటే వారు మ‌రో ఎత్తుగ‌డ తీసుకోరా?  

లైంగిక వేధింపులు అంటూ.. త‌మ బ‌త‌కుల‌ను బ‌జారున పెట్టుకుంటారా? భార‌త‌దేశం ప‌విత్ర‌భూమి అని చెప్పుకునే బీజేపీయులు త‌మ‌దేశం ప‌రువును అంత‌ర్జాతీయ వేదిక‌పై నిల‌బెడుతున్న యువ‌తులు తాము వేధింపులుకు గుర‌వుతున్నామ‌ని అంటే స్పందిస్తున్న తీరు ఇది! షేమ్ షేమ్!