బేరం తెగాలంటే.. చాలా సిటింగులు నడవాల్సిందే!

తెలుగుదేశం పార్టీ- జనసేన మధ్య సీట్ల పంపకానికి సంబంధించి.. ఇంకా అనేకానేక ‘కీలకమైన’ అంశాలకు సంబంధించి బేరం ఇంకా తెగలేదు. పెద్ద తలకాయలు మళ్లీ మళ్లీ కూర్చున్నా సరే.. ఇంకా బేరం తెగేదాకా మంతనాలు…

తెలుగుదేశం పార్టీ- జనసేన మధ్య సీట్ల పంపకానికి సంబంధించి.. ఇంకా అనేకానేక ‘కీలకమైన’ అంశాలకు సంబంధించి బేరం ఇంకా తెగలేదు. పెద్ద తలకాయలు మళ్లీ మళ్లీ కూర్చున్నా సరే.. ఇంకా బేరం తెగేదాకా మంతనాలు సాగలేదు. 

ఇరుపక్షాల నుంచి ఆఫర్లు, ఆశలు వేర్వేరుగా ఉన్నాయి. అందుకే పొత్తులకు సంబంధించి ఇంకా అధికారిమైన ప్రకటన బయటకు రాలేదు. అయితే ఈ బేరం ఇప్పట్లో తెగేలాగా కూడా కనిపించడం లేదు. బేరం ఫైనలైజ్ కావడానికి చంద్రబాబునాయుడు- పవన్ కల్యాణ్ మధ్య ఇంకా చాలా సిటింగులు అవసరం పడే వాతావరణం కనిపిస్తోంది. జనసేన పార్టీలో నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ కూడా ధ్రువీకరించేశారు. 

తెలుగుదేశం పార్టీ – జనసేన మధ్య కేవలం సీట్ల పంపకానికి సంబంధించిన గొడవ మాత్రమే ఉండేట్లయితే బహుశా ఈ బేరం ఎప్పుడో తెగిపోయి ఉండేది. ఎటూ పవన్ కల్యాణ్ కు చాలా ఎక్కువ సీట్లలో పోటీచేయడానికి, అన్నిచోట్ల తిరిగి ప్రచారం చేయడానికి తగిన ఓపిక గానీ, శ్రద్ధ గానీ లేవు. షూటింగుల మధ్యలో అన్ని నియోజకవర్గాల మీద కాన్సంట్రేట్ చేసే టైం కూడా లేదు. కాబట్టి ఆయన ఆశిస్తున్న నెంబరుకు కాస్త అటుఇటుగా ఒప్పేసుకుంటారు. 

కానీ ఈ డీల్ లో ఇంకా చాలా అంశాలున్నాయి. పొత్తు ద్వారా.. తెలుగుదేశం పార్టీకి తాను అదనపు బలంగా మారి సహకరిస్తున్నందుకు.. చంద్రబాబునాయుడు తరఫు నుంచి తమ పార్టీకి ఎలాంటి సహకారం, ఆఫర్ ఉంటుందో కూడా తేలవలసి ఉంది. 

ఇప్పటికే చంద్రబాబునాయుడు- పవన్ కల్యాణ్ మూడుసార్లు భేటీ అయ్యారు. అవుట్‌పుట్ మాత్రం బయటకు రాలేదు. వారాహి యాత్రతో జగన్ కు దడ పుట్టిస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్.. గత ఏడాది విజయదశమికి ప్రారంభిస్తానన్న యాత్రను ఇప్పటిదాకా పట్టించుకోలేదు. చంద్రబాబుతో బేరం తెగకపోవడానికి దీనికి ముడి ఉన్నదని కూడా పలువురు భావిస్తున్నారు. 

డీల్ ఎలా ఫైనలైజ్ అవుతుందనే దానిని బట్టి.. వారాహి రూట్ మ్యాప్ డిజైన్ చేయాలనేది పవన్ కల్యాణ్ ఆలోచన. తన కష్టం వల్ల, యాత్రవల్ల తెలుగుదేశానికి కూడా మైలేజీ వచ్చేస్తుందని ఆయన అభిప్రాయం. డీల్ ఎలా తేలుతుందనే దానిని బట్టి.. ఎన్ని టీడీపీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా, ఎన్ని జనసేన నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలో ఆయన డిసైడ్ అవుతారు. 

అదే సమయంలో బిజెపి ఫ్యాక్టర్ కూడా.. ఈ ఇరువురి భేటీలు మళ్లీ మళ్లీ జరగాల్సిన అవసరాన్ని తెలియజెబుతున్నట్టుగా ఉంది. బిజెపిని వదలి పవన్ కల్యాణ్ మాత్రం రావడం చంద్రబాబుకు ఇష్టం లేదు. ఆ సంగతి తేల్చడానికి కూడా పవన్ కల్యాణ్ తో చంద్రబాబు మళ్లీ మళ్లీ భేటీ కాక తప్పదు. నాదెండ్ల మాటలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.