జగన్ని పక్కాగా ఇరికించే ప్లాన్… ?

ముఖ్యమంత్రి జగన్ కి విశాఖ అంటే ఇష్టం. అలా అని ఆయన పదే పదే విశాఖ టూర్లు వేసుకోరు. ఇక విశాఖ వచ్చినా ఆ పని అయిపోగానే వెంటనే వెళ్ళిపోతారు. విశాఖలో ఒక నైట్…

ముఖ్యమంత్రి జగన్ కి విశాఖ అంటే ఇష్టం. అలా అని ఆయన పదే పదే విశాఖ టూర్లు వేసుకోరు. ఇక విశాఖ వచ్చినా ఆ పని అయిపోగానే వెంటనే వెళ్ళిపోతారు. విశాఖలో ఒక నైట్ హాల్ట్ కూడా సీఎం గా జగన్ చేసింది లేదు. ఇదిలా ఉంటే విశాఖ శారదాపీఠానికి మాత్రం జగన్ తరచూ వస్తున్నారు. వచ్చిన ప్రతీ సారీ గంటల పాటు ఉంటున్నారు. తాజా టూరులో జగన్ కచ్చితంగా నాలుగు గంటల పాటు పీఠంలో ఉన్నారు. ప్రత్యేక పూజాలు కూడా చేశారు.

ఇక్కడే బీజేపీ ఒక పాయింట్ పట్టుకుంది. జగన్ పీఠం ఎక్కువ టైమ్ ఉండడం ద్వారా తాను ఆస్థికుడిని అని గట్టిగా చెప్పుకునే వీలుంది. అందువల్ల పీఠంలో ఎక్కువ సేపు ఎందుకు ఉన్నారు అని అడగలేరు. అందుకే విశాఖ బీచ్ రోడ్ రుషికొండ వద్ద ఉన్న టీటీడీ వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రారంభించడానికి జగన్ కి కనీస టైమ్ లేకపోయిందా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఆ స్వామి కంటే మిగిలిన వారు ఎక్కువ అయ్యారా అని లాజిక్ పాయింట్ కూడా తీస్తున్నారు. నిజానికి టీటీడీ వారు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. జగన్ వచ్చి దాన్ని ప్రారంభిస్తే చాలు, భక్త జనులకు రుషికొండ మరో తిరుమల కొండ అవుతుంది. కానీ ఎందుకో ఈ విషయంలో వైసీపీ పెద్ద్దలు ఎవరూ అంతగా దృష్టి సారించడంలేదు. దీంతో ఇపుడు వెంకటేశ్వర స్వామి వారిని వెయిట్ చేసేలా చేస్తారా. ఇదేనా పద్ధతి అంటున్నారు బీజేపీ నేతలు.

దీని మీద మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అయితే గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ సర్కార్ కి పది రోజుల టైం మాత్రమే ఇస్తున్నాం, మీరు ఆ లోగా స్వామి వారి ఆలయాన్ని ప్రారంభించకపోతే మేమే ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

దీంతో మరి వైసీపీ ఏం చేస్తుంది అన్నది ఇక్కడ పాయింట్. శారదాపీఠాన్ని తరచూ సందర్శిస్తూ హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉందని చెప్పుకుంటున్న వైసీపీ పెద్దలకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభించే తీరిక లేదా అన్న పాయింట్ బీజేపీ తీసుకొస్తోంది. 

మరి ఇది జనంలోకి వెళ్తే ఎలా అన్నది వైసీపీ వరే ఆలోచించుకోవాలి. అయినా ఈసారి జగన్ టూర్ లొ ఈ ఆలయాన్ని ప్రారంభించేలా ప్రోగ్రాం రెడీ చేసుకుంటే పోలా అని వైసీపీ నుంచి కూడా వినిపిస్తున్న మాట. మరి బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే తక్షణం చేయాల్సిన పని కూడా అదే.