తన రూటే సపరేట్ అంటూ సినిమా డైలాగ్‌తో విలక్షణ నటుడు మోహన్‌బాబు ఆకట్టుకున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా తనది ప్రత్యేక పంథా అని నిరూపించుకున్నారు. సినీ సమస్యలపై చర్చించేందుకు ఏకంగా ఏపీ మంత్రి పేర్ని నానిని ఇంటికే రప్పించుకుని మోహన్‌బాబా…. మజాకా అనిపించుకున్నారు. ముక్కు సూటిగా మాట్లాడే మోహన్‌బాబుకు సమస్యలనేవి కొత్తవి కావు. మెగాస్టార్ చిరంజీవితో గతంలో ఆయన గొడవ బహిరంగ రహస్యమే. ఇటీవల “మా” ఎన్నికల్లో కూడా మోహన్‌బాబు ప్రత్యర్థులపై చేయి చేసుకుని తన మార్క్ నైజాన్ని ప్రదర్శించారు.
చిత్ర పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య ఆరేడు నెలలుగా వివిధ అంశాలకు సంబంధించి గొడవ జరుగుతోంది. ప్రధానంగా సినిమా టికెట్ ధరల తగ్గింపు, అలాగే నాలుగు షోలకే పరిమితం చేయడం, థియేటర్ల సీజ్ తదితరాలు ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు గ్యాప్‌ను పెంచాయి. చివరికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఎట్టకేలకు సమస్యలకు పరిష్కారం లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పలు దఫాలుగా చిరంజీవి నేతృత్వంలో భేటీ కావడం, ఆ చర్చలు గురువారం నాటితో కొలిక్కి రావడంతో చిత్ర పరిశ్రమగా మెగాస్టార్‌ను మరోసారి అందరూ కొనియాడుతున్నారు.
ఇదిలా ఉండగా మోహన్‌బాబును ఏపీ ప్రభుత్వం విస్మరించిందన్న చర్చకు తెరలేచింది. దగ్గరి బంధువు కూడా అయిన మోహన్‌బాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూరం పెట్టారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ చర్చ ఒకవైపు జరుగుతుం డగానే, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని హైదరాబాద్‌లో మంచు మోహన్‌బాబు ఇంటికెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సినీ సెలబ్రిటీలంతా ముఖ్యమంత్రి జగన్ ఇంటికెళితే, మోహన్‌బాబు మాత్రం సినిమాటోగ్రఫీ మంత్రిని తన ఇంటికి రప్పించు కోవడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి మంత్రి పేర్ని నాని వెళ్లారు. అనంతరం మోహన్‌బాబు ఇంటికి మంత్రి వెళ్లడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
చిత్ర పరిశ్రమ సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోహన్‌బాబుకు మంత్రి వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మరికొన్ని చిత్ర పరిశ్రమ సమస్యలను కూడా మంత్రి దృష్టికి మోహన్‌బాబు తీసుకెళ్లారని సమాచారం. అలాగే ముఖ్యమంత్రిని సన్మానించడంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకు మోహన్‌బాబు అపాయింట్ మెంట్ అడిగినట్టు సమాచారం.