టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసులో నటీనటులకు అసలు సంబంధమేమీ లేదంటూ ఆమధ్య క్లీన్ చిట్ ఇచ్చింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ రెండుసార్లు విచారణ జరిపి మరీ నటీనటులపై మచ్చలేదని తేల్చింది.
డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ ఒక్కడే ఇప్పుడు ప్రధాన ముద్దాయి. అయితే ఇక్కడ కెల్విన్ తో జరిపిన ఆన్ లైన్ లావాదేవీలు, ఇతర నగదు వ్యవహారాలు ఇప్పుడు టాలీవుడ్ ను పట్టిపీడిస్తున్నాయి. దీనికి సంబంధించిన డిజిటల్ రికార్డ్ లను ఈడీకి సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చింది.
ఇరుక్కున్నట్టేనా..?
తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ టాలీవుడ్ నటీనటులకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఎవరో పెద్దలు ఈ కేసులో సినిమావాళ్లను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేరుగా ప్రభుత్వంలోని పెద్దల్ని టార్గెట్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకూ డిజిటల్ రికార్డులను ఎక్సైజ్ శాఖ ఈడీకి సమర్పించకపోవడం విశేషం. దీనిపై ఈడీ లేఖ రాయడం, తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలివ్వడంతో ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారింది.
సినిమా వాళ్లకు తలనొప్పి తప్పదా..?
కెల్విన్ హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చాడు, హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యాపారం చేశాడు అనేది వాస్తవం అయినప్పుడు, కెల్విన్ ని పోలీసులు ప్రధాన ముద్దాయిగా తేల్చినప్పుడు.. అతని వద్ద నుంచి ఎవరు డ్రగ్స్ కొన్నారనేది మాత్రం ఎందుకు బయటకు రాలేదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది మాత్రమే అనుమానితులు ఎందుకయ్యారు, విచారణ తర్వాత వారంతా కడిగిన ముత్యాలంటూ ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి..? దీనిపై ఇప్పటి వరకూ ఆరోపణలు వచ్చాయంతే.
ఇప్పుడు ఈడీ నేరుగా లైన్లోకి రావడంతో.. డిజిటల్ రికార్డుల్లో ఎవరెవరు ఎంతెంత కెల్విన్ కి ట్రాన్స్ ఫర్ చేశారు, ఎవరెవరికి ఈ డ్రగ్స్ దందాతో సంబంధం ఉంది అనేది బయటపడే అవకాశముంది. డిజిటల్ రికార్డుల్లోనే అసలు విషయం దాగి ఉంది. ఈ కేసును తెలంగాణ ఎక్సైజ్ వదిలేసినా, ఈడీ వదిలిపెట్టేలా కనిపించడం లేదు.