గడిచిన 3 రోజులుగా మంచు విష్ణుపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి వెళ్లి సీఎం జగన్ ను కలిస్తే, దాన్ని వ్యక్తిగత సమావేశంగా కొట్టిపారేశాడు విష్ణు. ఆ ప్రకటన వచ్చిన 2 రోజులకే మహేష్-ప్రభాస్ తో కలిసి వెళ్లి మరీ మరోసారి ముఖ్యమంత్రిని కలిశారు చిరంజీవి. దీనిపై నిన్నంతా మంచు విష్ణు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు.
చిరంజీవి వెళ్లింది వ్యక్తిగత మీటింగ్ కోసం కాదని, ఇండస్ట్రీ బాగు కోసమని స్వయంగా ముఖ్యమంత్రి జగన్, మంత్రి పేర్ని నాని పరోక్షంగా చెప్పడంతో విష్ణుకు సోషల్ మీడియాలో తలనొప్పి తప్పలేదు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరోసారి మంచు విష్ణు ట్రోలింగ్ కు గురవుతున్నాడు. ఈసారి కూడా ఓ కారణం ఉంది.
ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి బృందం జరిపిన చర్చలకు మోహన్ బాబు, మంచు విష్ణు వెళ్లలేదు. ఈరోజు హైదరాబాద్ వచ్చిన మంత్రి పేర్ని నాని, మోహన్ బాబును ఆయన నివాసంలో కలిశారు. చర్చలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించిన ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి కూడా అప్ డేట్స్ అందించారు.
నిన్న చిరంజీవి మీటింగ్ కు సంబంధించి ఎలాంటి స్పందన వ్యక్తంచేయని మంచు విష్ణు, ఈరోజు మంత్రి తన ఇంటికొచ్చాడంటూ ట్వీటేశాడు. అయితే ఈసారి కూడా చిరంజీవిని మెన్షన్ చేయకపోవడంతో మెగాభిమానులు భగ్గుమంటున్నారు. విష్ణుపై విరుచుకుపడుతున్నారు.
ఒక ట్వీట్ డిలీట్.. కొత్తగా మరో డిలీట్..
ఇక్కడితో అయిపోయిందనుకోవడానికి వీల్లేదు. మంచు విష్ణు మరో పని చేశాడు. ముందుగా ఓ ట్వీట్ వేశాడు. కాసేపటికి దాన్ని డిలీట్ చేసి మరో ట్వీట్ వేశాడు. ముందు వేసిన ట్వీట్ లో టికెట్ రేట్ల సమస్యపై చొరవ తీసుకున్నందుకు గాను, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్లాన్స్ ను తమకు అప్ డేట్ చేసినందుకు నానికి కృతజ్ఞతలు చెప్పాడు మంచు విష్ణు. అంతలోనే ఆ ట్వీట్ ను, ఆ వాక్యాన్ని తొలిగించి కేవలం తమ ఇంటికొచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ వేశాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండస్ట్రీకి సంబంధించి ఏం చేయబోతోందో, ముందే వెళ్లి మోహన్ బాబుకు చెప్పిందా? మంచు విష్ణు అనుమతి తీసుకుందా? అంటే మంచు విష్ణు అనుమతి ఇవ్వకపోతే, ఏపీ ప్రభుత్వం తన ప్రణాళికను అమలు చేయదా? ఇలాంటి ప్రశ్నలు మంచు విష్ణును ఉక్కిరిబిక్కిరి చేశాయి. పైగా ప్రభుత్వ పెద్దలు కూడా ఈ ట్వీట్ పై అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటారు. అందుకే మంచు విష్ణు ఆ ట్వీట్ తొలిగించి ఫ్రెష్ గా ఇంకోటి వేశాడు అనుకోవాలి.
మరోవైపు ముఖ్యమంత్రితో జరిపిన చర్చలకు వెళ్లకుండా, ఇలా మంత్రిని ఇంటికి పిలిపించుకొని, శాలువా కప్పి తాము ప్రత్యేకమని చెప్పుకునే ప్రయత్నం చేయడం మంచు ఫ్యామిలీకి తగదంటూ ఉచిత సలహాలిస్తున్నారు నెటిజన్లు. నిజంగా ఇండస్ట్రీపై అంత ప్రేమ ఉంటే చిరంజీవితో పాటు వెళ్లి ఉంటే బాగుండేదని, తమ పలుకుబడితో ఇలా మంత్రిని ఇంటికి పిలిపించుకోవడం వల్ల ఇండస్ట్రీకి ఎలాంటి ఉపయోగం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.