టైటిల్: ఖిలాడి
రేటింగ్: 2/5
తారాగణం: రవితేజ, అర్జున్, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అనసూయ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు
కథ: శ్రీకాంత్ విస్సా
సంభాషణలు: సాగర్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
కెమెరా: సుజిత్, విష్ణు
ఎడిటర్: అమర్ రెడ్డి
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేష్ వర్మ
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022
పోయినేడాది “క్రాక్” తో హిట్ కొట్టిన రవితేజ ఈ సారి “ఖిలాడి”తో ముందుకొచ్చాడు.
విడుదలకి ముందు జరిగిన వేడుకలో “శ్రీకాంత్ విస్సా కథ వినగానే ఓకే చేసాను” అంటూ ఆ కథకుడిని వేదికమీదకు పిలిచి హత్తుకుని అభినందించాడు రవితేజ. అలాంటి కథకుడిని పరిచయం చేసినందుకు దర్శకుడు రమేష్ వర్మకి ధన్యవాదాలు కూడా చెప్పాడు.
దీంతో సినిమాపై నమ్మకం పెరిగి అంచనాలు ఏర్పడ్డం మొదలయ్యాయి.
అసలేం కథ విని రవితేజ ఈ సినిమాని ఓకే చేసాడో అర్థం కాదు. ఇందులో ఇంటర్వెల్ ట్విస్టు అనే పాయింట్ తప్ప ఇంకేమీ లేదు. కేవలం పాయింటు నచ్చి సినిమా ఓకే చేసాడంటే దర్శకుడి మీద అపారమైన నమ్మకముండుండాలి. మరి అదే దర్శకుడితో తాను చేసిన “వీరా” బ్లాక్ బస్టరేమీ కాదు. ఆ దర్శకుడు ఈ మధ్యన తీసిన స్ట్రైట్ కమెర్షియల్ ఎంటర్టైనర్ కూడా ఏదీ లేదు. మరి ఎందుకు ఒప్పుకున్నట్టు? నిర్మాత ఇవ్వజూపింది నచ్చుండాలంతే.
జైల్లో సింగిల్ సెల్లో ఉన్న ఒక ఖైదీని మారుపేరుతో విడుదల చేయడమనే ఐడియాని ఇంత హీనంగా ఊహించి రాసుకోవడం ఈ కథకే చెల్లింది. పైగా తప్పు జరిగిందని తెలుసుకున్నాక ఆ ఖైదీని జైలు ఔట్ గేట్ బయట ఆపడానికి ఏకంగా తుపాకులు పట్టుకుని టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగిపోతుంది. అక్కడ చిత్రీకరించిన ఫైట్ పౌరాణిక సినిమాల్లో కూడా చూసుండం. అంతమంది సాయుధులైన పోలీసుల్ని సింగిల్ హ్యాండుతో లేపేసిన మన ఖిలాడి వెక్కిరిస్తూ పారిపోవడం అస్సలు అర్థం కాదు.
లాజిక్ లేకపోయినా మ్యాజిక్ వర్కౌటవ్వాలి. అదికూడా లేదిందులో. ఇలా లాజిక్ కి మ్యాజిక్ కి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో నడుస్తుంటుంటాయి సన్నివేశాలు.
స్వయంగా కోర్టులో తన నేరాలన్నీ ఒప్పుకున్న ఒక ముద్దాయికి జడ్జ్ గారు నోటికొచ్చిన రెండు సెక్షన్స్ చెప్పి 20 ఏళ్ల జైలు శిక్ష అంటాడు.
అక్షరాస్యత పెరిగి గూగుల్ చేసి ఏ సెక్షన్ ఏంటో తెలుసుకునే కుతూహలం చూపిస్తున్న ప్రేక్షకులున్న ఈ రోజుల్లో డయలాగులైనా కాస్త అర్థవంతంగా రాసుకోవాలని ఎందుకనిపించలేదో.
సంభాషణలు పేలవంగా ఉన్నాయి. ఎక్కడా మెరుపుల్లేవు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగున్నాయి. ఈ సినిమాని చివరి వరకు భరించేలా చేసింది దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్కే.
కెమెరా, ఎడిటింగ్ కూడా ఎక్కడా డౌన్ అవ్వలేదు.
మొత్తమ్మీద ఇంత బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీసిన నిర్మాత గట్స్ ని మెచ్చుకోవాలి.
అన్నట్టు హీరోయిన్ కి డయలాగులతో లిప్ సింక్ అవ్వలేదు. హీరోతో మాత్రం లిప్ లాకులయ్యాయి. రెండోది జరిగితే చాలనుకున్నట్టున్నాడు దర్శకుడు.
మొదటి సగంలో హీరోయిన్ ని పూర్తిగా చీరకట్టులో చూపిస్తే ఏమో అనుకుంటాం. కానీ సెంకండాఫులో పరిస్థితి వేరేలా ఉంది. ఆఖరికి అనసూయ కూడా బాబోయ్ అనిపించేలా వస్త్రధారణ చేసుకుంది. చాలా ఎబ్బెట్టుగా ఉంది. క్యారెక్టర్ ని బట్టి దుస్తులుంటాయని వాదించినా ఎటువంటి బట్టలకి ఎటువంటి శరీరాలు నప్పుతాయో కూడా వేసుకునేవాళ్లకే కాదు కాస్ట్యూం డిజైనర్ కి, దర్శకుడికి కూడా తెలియాలి. అనసూయ విషయంలో వీళ్లంతా ఫెయిలైనట్టే.
దర్శకుడు కూడా సీనార్డర్ ఫాలో అయిపోతూ తీసుకుపోయినట్టుంది తప్ప ఆడియన్స్ కి ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఎలా అందించాలో కనీస కసరత్తు కూడా చేసినట్టు కనపడదు. ఫస్టాఫ్ ఒకలాగ, సెకండాఫ్ ఒకలాగ ఉండి ఒకే టికెట్ మీద రెండు సినిమాల చూసిన ఫీలింగొస్తుంది.
స్టైల్ మీద పెట్టిన ఫోకస్ సబ్స్టాన్స్ మీద పెట్టలేదు.
డింపుల్ హయతి మేకప్ కూడా అరకొరగా ఉంది. మొహం ఒక రంగులోనూ, చేతులు మరొక రంగులోనూ కనిపించాయి. డ్యాన్సులు మాత్రం చాలా కష్టపడి చేసింది.
మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా అంతే. గ్లామర్ కే పరిమితమయ్యారు ఇద్దరూ.
సన్నగా ఉన్నంత మాత్రాన కుర్రాడిలా ఉన్నట్టు కాదు. రవితేజ సన్నగానే ఉన్నా మొహంలో మాత్రం వయసు బాగా కనిపిస్తోంది. తన వయసుకి తగ్గ పాత్రలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. లేదా మొహమ్మీద క్యారీ బ్యాగులు తొలగించే గ్రాఫిక్స్ ప్రక్రియని దగ్గరుండి చూసుకుని ఇంకొన్నాళ్లు తోచినట్టు కాలక్షేపం చేయొచ్చు.
సాధారణంగా కథనం ఎలా ఉన్నా రవితేజ తన ఎనెర్జీతో సినిమా మొత్తాన్ని మోసేస్తాడు. కానీ ఆ ఎనెర్జీ ఇక్కడ కనపడలేదు. చాలా కృతకంగా, రొటీన్ సన్నివేశాలతో సాగే ఫస్టాఫులో సైతం రవితేజ మార్క్ పంచ్ పడలేదు. అసలు రవితేజ మనసుపెట్టి పనిచెసినట్టుగా అనిపించలేదు ఈ చిత్రం మొత్తంలో.
ఇతర నటీనటులంతా ఎప్పటిలాగానే ఉన్నారు తప్ప కొత్త కోణాలేవీ లేవు.
విడుదలకి ముందు తాను కథ చెపగానే 15 నిమిషాల్లో రవితేజ ఓకే చేసాడని చెప్పుకోవడం, అసలు శ్రీకాంత్ విస్సా కథ వినగానే నిర్ణయం తీసుకున్నాను తప్ప మరొకరు కారణమే కాదని రవితేజ రమేష్ వర్మకి వేదికమీద క్రెడిట్ ఇవ్వకపోవడం…వెరసి ఏదో తేడాకొట్టిందన్న సంకేతాలు ప్రేక్షకులకి కలగాయి. సినిమా చూసాక ఆ సంకేతాలు నిజమని తేలాయి.
బాటం లైన్: లాజిక్ లేని అతి