జగన్ పాలనను టార్గెట్ చేసి మాట్లాడటం ప్రతిపక్షాలకు అస్సలు కుదరడంలేదు. అసలు పాలనపై ఏం మాట్లాడాలి, ఎలా విమర్శించాలి అని కూడా వారికి అర్థం కావడంలేదు. దీంతో పాలనను వదిలేసి పోలీసులు, అధికారులపై విరుచుకుపడుతున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా నారా లోకేష్.. పోలీసులు, అధికారులపై విరుచుకుపడుతున్నారు. మేం అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామంటూ పబ్లిక్ గా వార్నింగులు ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ టీడీపీ నేతలు వివిధ కేసుల్లో అరెస్ట్ అయితే పోలీసులపై ప్రతాపం చూపించేవారు. అరెస్ట్ కావడానికి దారి తీసిన కారణాలను విశ్లేషించకుండా పోలీసుల్ని తప్పుబడితే ప్రయోజనం ఏముంటుంది.
అశోక్ బాబు అరెస్ట్ తర్వతా మరోసారి లోకేష్ ఇలా అధికారులపై విరుచుకుపడ్డారు. మూర్ఖుడు రాజ్యమేలితే వ్యవస్థలన్నీ చెరబడతాడంటూ చాలా పెద్ద పదమే వాడేశారు. ఇక అర్థరాత్రి తమ ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు లోకేష్. పీఆర్సీ, సీపీఎస్ రద్దు విషయంలో అశోక్ బాబు నిలదీశారని, అందుకే ఆయనపై కక్షగట్టుకుని కేసులు పెట్టారనేది లోకేష్ వాదన. ఇక అక్కడితో ఆగలేదు. సీఐడీని రాజకీయ కక్షసాధింపు సంస్థగా మార్చుకున్నారని జగన్ పై మండిపడ్డారు చినబాబు. వ్యవస్థలను దిగజారుస్తున్నారంటూ విమర్శించారు.
అసలు వ్యవస్థలను గుప్పెట పట్టడం, వాటిని తమ అవసరాలకు వాడుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడనే విషయాన్ని చినబాబు మరచిపోయినట్టున్నారు. అసలు అశోక్ బాబు తప్పేమీ లేనట్టు ఇక్కడ లోకేష్ మాట్లాడటం మరీ విచిత్రం. దీనికితోడు అధికారులకు వార్నింగ్ ఇవ్వడం లోకేష్ చేతకానితనానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
తప్పుడు సర్టిఫికెట్ తో పదోన్నతి పొందితే అశోక్ బాబుకి సన్మానం చేయాలా..? తనపై కేసులేవీ లేవంటూ అశోక్ బాబు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అఫిడవిట్ ఇస్తే.. అతనికి పూలదండలు వేయాలా..? ఇవేవీ చేయనందుకు సీఐడీని లోకేష్ తిట్టాలా..? ఇప్పటి వరకూ పోలీసుల్ని తిట్టిన టీడీపీ నేతలు, ఇప్పుడు ఉన్నతాధికారుల్ని తప్పుబడుతున్నారు. వ్యవస్థలని వేలెత్తి చూపిస్తున్నారు. పతనానికి పరాకాష్ట ఇదే.
జగన్ ని, జగన్ పాలనను విమర్శించడం, వేలెత్తి చూపించడం చేతగాక.. ఇలా పోలీసుల్ని, అధికారుల్ని తప్పుపడుతూ.. మేం అధికారంలోకి వస్తే అప్పుడు మా ప్రతాపం చూపిస్తామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు లోకేష్. అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ లోకేష్ చేస్తున్న హెచ్చరికలు చూసి టీడీపీ నేతలే నవ్వుకుంటున్నారు. ముందు ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత ఇలాంటి హెచ్చరికలు చేస్తే బాగుంటుందని చెవులు కొరుక్కుంటున్నారు.