చిత్ర పరిశ్రమకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇవ్వడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత మీడియా జీర్ణించుకోలేకపోతోంది. దీంతో చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వ ఆఫర్‌ను ఎర అంటూ వక్రభాష్యం చెబుతోంది. సీఎం జగన్ ఆఫర్‌ను అందుకుని ఆంధ్రాకు చిత్ర పరిశ్రమ తరలిపోతే తెలంగాణ ఆర్థికంగా భారీగా నష్టపోతుందనే ఆవేదన, ఆక్రోశం కేసీఆర్ మీడియా రాతల్లో కనిపిస్తోంది.
చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ సెలబ్రిటీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఇచ్చిన ఆఫర్ కేసీఆర్ మీడియాకు మింగుడు పడడం లేదు. తమ ఆఫర్‌ను అంగీకరిస్తేనే చిత్ర పరిశ్రమకు సహకరిస్తామని జగన్ ప్రభుత్వం షరతు పెట్టినట్టు కథనాలు వండివార్చుతోంది.
కేసీఆర్ మీడియాకు కోపం తెప్పించేంత ఆఫర్ చిత్ర పరిశ్రమకు జగన్ ఏమిచ్చారో తెలుసుకుందాం. సినీ పెద్దలతో జరిగిన సమావేశంలో జగన్ ఏమన్నారంటే…
“తెలంగాణతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది. తెలంగాణ 35 నుంచి 40% కంట్రిబ్యూట్ చేస్తుంటే.. ఆంధ్రా 60% వరకు కంట్రిబ్యూట్ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, థియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయ పరంగా కూడా ఎక్కువ. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపించే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. వాతావరణం బాగుంటుంది. అందరికీ స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీ పడగలదు. మనం ఓన్ చేసుకోవాలి, మనందరం అక్కడికి వెళ్లాలి. ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో మహా నగరాలతో పోటీ పడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి”
జగన్ అన్న మాటల్లో ఏ ఒక్కటీ అబద్ధం లేదు. తెలంగాణ కంటే ఆంధ్రాలోనే చిత్రపరిశ్రమకు ఆదాయం ఎక్కువ. కానీ ఆంధ్రాలో మాత్రం షూటింగ్‌లు చేయరు. ఇతరత్రా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు నిర్వర్తించరు. కానీ చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వాలనే కోరడంలో అర్థం ఉందా? విశాఖకు వస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని రాష్ట్రాధినేతగా జగన్ ఆఫర్ ఇవ్వడం తెలంగాణ సర్కార్‌కు రుచించడం లేదు.
అందుకే చిరంజీవి బృందానికి ఎర వేశారని, షరతులు విధించారని, ఇంకా ఏవేవో కించపరిచే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ మీడియా తన స్వామి భక్తిని ప్రదర్శిస్తోంది.