ఏపీకి నేనే చివ‌రి సీఎం అన్న‌ట్టు…

అప్పు కోసం విజ‌య‌వాడలో పార్కును తాక‌ట్టు పెట్ట‌డంపై మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు పేరుతో ఇబ్బడిముబ్బ‌డిగా అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నాడ‌ని…

అప్పు కోసం విజ‌య‌వాడలో పార్కును తాక‌ట్టు పెట్ట‌డంపై మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు పేరుతో ఇబ్బడిముబ్బ‌డిగా అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నాడ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌పై చంద్ర‌బాబు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

జగన్‌కు సొంత లాభం తప్ప.. ప్రజాక్షేమం పట్టదన్నారు. రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. జగన్‌ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే.. ప్రజాచైతన్యం రావాలని బాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు.

రెండున్నరేళ్లలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారం మోపిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని మండిపడ్డారు.

ఏపీకి తానే చివరి సీఎం అన్నట్లు.. రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మ‌డ‌మో, తాక‌ట్టు పెట్ట‌డ‌మో జ‌గ‌న్ చేస్తున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. చివరికి చెత్త పైనా పన్ను వేసే పరిస్థితి తీసుకొచ్చార‌న్నారు. నీతి నిజాయితీగా రాష్ట్రంలో రూపాయి కూడా ఎవరూ సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

ఇంత‌కూ రాష్ట్ర అప్పులో త‌న భాగ‌స్వామ్యం ఎంతో చంద్ర‌బాబు చెప్పి వుంటే బాగుండేద‌ని ప్ర‌త్య‌ర్థులు ప్ర‌శ్నిస్తున్నారు. అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్ర ఖ‌జానాలో కేవ‌లం రూ.100 కోట్లు మాత్ర‌మే చంద్ర‌బాబు మిగిల్చార‌నే వాస్త‌వాన్ని ప్ర‌త్య‌ర్థులు గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఒక వేలు చూపితే, మిగిలిన నాలుగు ఆయ‌న వైపే ఉండ‌డం గ‌మ‌నార్హం.