కర్నాటకను హిజాబ్ వివాదం వణికిస్తోంది. కేవలం మత విశ్వాసాలను రెచ్చగొట్టడమే ప్రాతిపదికగా దేశంలో రోజురోజుకూ బలపడుతున్న పార్టీ ఏదో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉత్తరాధిలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే కర్నాటకలో వచ్చే ఏడాదిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలాంటివి క్రియేట్ చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇదిలా వుండగా హిజాబ్ వ్యవహారం సర్వోన్నత న్యాయం చేరింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కర్నాటక హైకోర్టు విచారిస్తోంది. ఈ వివాదంపై తుది తీర్పు వెల్లడించే వరకూ ఎవరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి కళాశాలలకు వెళ్లొద్దని ఆ రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మౌఖిక తీర్పు ఇచ్చింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కర్నాటకకు చెందిన ఓ విద్యార్థిని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ పిల్‌పై వెంటనే విచారణ జరపాలని విద్యార్థిని చేసిన అభ్యర్థనను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించడం గమనార్హం.
తక్షణం విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సరైన సమయంలోనే ఆ అంశంపై విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంత వరకూ సంయమనం పాటించాలని కోరింది. కర్నాటక హైకోర్టు ధర్మాసనం తుది తీర్పు ఇచ్చే వరకు వేచి ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ సమస్యను జాతీయ స్థాయి సమస్యగా చూడవద్దని లాయర్లకు సీజే ఎన్వీ రమణ సూచించారు.