వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) వెటకారానికి పెట్టింది పేరు. తానెవరికీ బాధ్యత వహించనని చెప్పే ఆర్జీవీ, ఇతరులు మాత్రం పద్ధతిగా వుండాలని కోరుకుంటుంటారు. అలాగని ఆ విషయాన్ని బయటికి చెప్పరు. రాజకీయ, సినీ సెలబ్రిటీలపై వివాదాస్పద ట్వీట్లు, కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవడం ఆయన ప్రత్యేకత.
తాజాగా చిత్ర పరిశ్రమ సమస్యలపై ఏపీ సీఎం జగన్‌తో చర్చించిన మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందంపై ఆర్జీవీ తన మార్క్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించడం గమనార్హం. జగన్‌తో భేటీ అనంతరం చిత్ర పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడిందని చిరంజీవితో పాటు ఆయన సహచరులు మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి తదితరులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జగన్‌తో చర్చలు సఫలం అయ్యాయని చిరంజీవి బృందం ప్రకటించడంపై ఆర్జీవీ ట్విటర్ వేదికగా స్పందించారు.
“సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్లే ఇది జరిగినప్పటికీ, ఒమెగా స్టార్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను. వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించారు. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలులను నేను ఎంతో అభినందిస్తున్నాను” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
సూపర్ అంటే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, బాహుబలి అంటే హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి, మెగా అంటే మెగాస్టార్ చిరంజీవిగా అర్థం చేసుకోవాలి. అయితే తాను విమర్శించాలనుకున్న అంశాన్ని ఆర్జీవీ సరిగా చెప్పలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం విమర్శ కోసమే అన్నట్టుగా ఆర్జీవీ ట్వీట్ చేశారని నెటిజన్ల ఆరోపణ.