టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుపై ఏపీ సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీకి పాల్పడ్డారా? అంటే… ఔనని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. నకిలీ డిగ్రీ సమర్పించి వాణిజ్యపన్నుల శాఖలో ప్రమోషన్ పొందారని సంబంధితశాఖ ఉన్నతాధికారి ఫిర్యాదుతో గత నెలలో ఆయనపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం గత అర్ధరాత్రి ఆయన్ను అరెస్ట్ చేసి గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు.
అశోక్‌బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమా నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి పయనమయ్యారు. అయితే కార్యాలయంలోకి ఏ ఒక్కరినీ పోలీసులు భారీగా మోహరించారు. ఉమా నేతృత్వంలోని కార్యకర్తలను అశోక్‌బాబును కలిసేందుకు అనుమతించలేదు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యాలయంలోకి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో దేవినేనితో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి చంద్రబాబునాయుడు, తాను, అశోక్‌బాబు ఓ పెళ్లిలో కలిశామన్నారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన అశోక్‌బాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. గత రాత్రి అశోక్‌బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సంచలన ఆరోపణలు చేశారు.
ఒకవేళ థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని పోలీసులు నమ్ముతుంటే, అశోక్‌బాబును మీడియా ఎదుట హాజరు పరచాలని దేవినేని డిమాండ్ చేశారు. మీడియా ముందుకు అశోక్‌బాబును తీసుకొచ్చేందుకు సీఐడీ అధికారులకు భయమెందుకని ఆయన నిలదీశారు.
గతంలో రఘురామకృష్ణంరాజుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తనను విచక్షణా రహితంగా కొట్టారని రఘురామ కందిపోయిన కాళ్లను చూపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి ఆరోపణలే తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆరోపణలపై అశోక్‌బాబు స్పందన ఉత్కంఠ రేపుతోంది.