2019 ఎన్నికల వేడి పతాక స్థాయిలో ఉన్న తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. వివేక హత్య నాటికి పోలింగ్ సమయం సరిగ్గా నెల రోజులు. అప్పటికే అభ్యర్థుల ప్రకటనను పార్టీలు పూర్తి చేశాయి దాదాపుగా. నేతలంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. స్వయంగా వైఎస్ వివేకానందరెడ్డి కూడా తను మరణించే నాటికి ముందు రోజున ప్రచారంలో పాల్గొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీలో చేరిక కార్యక్రమంలోనే ఆయన పాల్గొన్నారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జమ్మలమడుగు ప్రతిష్టాత్మకంగా నిలిచింది.
ఆ నియోజకవర్గంలోని పాత కాపులు అటు ఆదినారాయణ రెడ్డి, ఇటు రామసుబ్బారెడ్డి ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండటంతో సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా నిలిచింది. దీంతో వివేక జమ్మలమడుగు నియోజకవర్గం బాధ్యుల్లో ఉన్నారు. ముందు రోజు జమ్మలమడుగుకు వెళ్లి వచ్చిన వివేకానందరెడ్డి తెల్లవారుఝాముకు విగత జీవులయ్యారు. ఉదయాన్నే వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనంగా బ్రేకింగ్ న్యూస్ గా మారింది.
ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ అందుకున్న మొదటి పాట.. సానుభూతి కోసం వివేకను జగన్ చంపించారనేది! ఇదంతా విజయసాయి రెడ్డి వ్యూహం అంటూ తెలుగుదేశం పార్టీ వాట్సాప్ గ్రూపులు కోడై కూసాయి! ఆ పాటను దాదాపు నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీ గట్టిగా పాడింది. అప్పటికే కోడికత్తి దాడితో జగన్ సానుభూతి పొందే ప్రయత్నం చేశాడన్న టీడీపీ, వైఎస్ వివేకానందరెడ్డిని కూడా జగన్ హత్య చేయించి ఎన్నికల ముందు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఎన్నికల వేడిలో గట్టిగా ప్రచారం చేసింది.
కేవలం వాట్సాప్ వర్గాల వరకే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రచారంలో ఇదే మాటే మాట్లాడారు. సానుభూతి కోసం హత్య చేయించారని అంటూ, వైఎస్ వివేకను జగన్ చంపించాడంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఒక నినాదంలా పదే పదే చెప్పారు! దీనిపై అభ్యంతరం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును కూడా ఆశ్రయించింది. ఒక దశలో కోర్టు జోక్యం చేసుకుంటూ.. వివేక హత్య గురించి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడవద్దంటూ రాజకీయ పార్టీలకు ఆదేశాలను జారీ చేసింది కూడా!
అయితే.. కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు లెక్క చేయలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్టుగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడసాగారు. కోర్టు ఆదేశాలు వచ్చే నాటికి ఇక ఎన్నికల ప్రచారం ఐదారు రోజుల పాటే మిగిలింది. అప్పటి వరకూ విపరీతంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ వాళ్లు. ఎన్నికల ముందు తమకు వరప్రదంగా ఈ అంశం దొరికిందనే ఆనందం వారిలో కనిపించింది. చివరకు కోర్టు ఆదేశాలు వచ్చాయి. అయితే వాటిని కూడా లెక్క చేయకుండా ప్రచారంలో చివరి రోజున చంద్రబాబు మళ్లీ వివేకానంద రెడ్డి హత్య గురించినే మాట్లాడారు. జగనే ఆ హత్య చేయించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు.
మరి అప్పటికి వివేకానందరెడ్డి హత్య జరిగి నెల రోజులు గడుస్తున్నా, తను ఏర్పాటు చేసిన సిట్ తన ఆరోపణలను నిరూపించలేకపోతున్నా.. చంద్రబాబు మాత్రం అప్పుడే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విపరీతంగా వాడారు.
అయితే చంద్రబాబు ఆరోపణలను ప్రజలు పెద్ద పట్టించుకోలేదు. పెద్దగా కాదు, అస్సలు పట్టించుకోలేదు! దాదాపు నెల రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వివేక పేరు స్మరించినా.. అప్పుడు టీడీపీ చిత్తయ్యింది. ఇక ఇప్పుడూ తెలుగుదేశం పార్టీ వివేకానందరెడ్డి హత్య కేసునే ఆధారంగా చేసుకుంటోంది. తమ హయాంలో హత్య జరిగితే, దాన్ని తేల్చడానికి విలువైన ముప్పై రోజుల సమయం దొరికితే.. అప్పుడేం తేల్చకుండా, అప్పుడూ ఇప్పుడూ తమకు తోచిన ప్రచారాలతో టీడీపీ ప్రయోజనాలను పొందాలని చూస్తోంది.
అప్పుడేమో సానుభూతి కోసం వివేకానందరెడ్డిని జగనే చంపించాడంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడేమో వివేకను అవినాష్ చంపించాడని, ఎంపీ పదవికి అడ్డు అవుతాడని వివేకను హత్య చేశారని మరో పాటను అందుకున్నారు. ఇదే తేడా!