సీనియర్ మంత్రి వైసీపీలో పెద్దాయనగా ఉన్న ధర్మాన ప్రసాదరావు తరచూ ప్రజలకు సూచనలు చేస్తూనే హెచ్చరిస్తున్నారు. అదే నోటితో దెప్పిపొడుతున్నారు. కొన్ని సార్లు నిందిస్తున్నారు. దీని వెనక ఏముంది. అసలు ధర్మాన మాటలు అర్ధమవుతున్నాయా. ఆయన ఎవరికి చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ చేరాల్సిన వారికి చేరుతున్నాయా అన్నదే ఒక ధర్మ సందేహం.
కొన్ని నెలలుగా ధర్మాన జగన్ పాలన గురించి జనాలకు వివరించే ప్రయత్నంతో తెలుసుకోండి వాస్తవాలు అని అంటున్నారు. మీకు జగన్ లాంటి సీఎం దొరకకపోతే పేదరికం అలాగే ఉండేది అని సైతం ధర్మాన ఒకసారి అన్నారు. మరోసారి జగన్ ఇన్నేసి పధకాలు మీ కోసం ప్రవేశపెడుతూ తాను విపక్షాల చేత విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా మేలు చేసిన వారి గురించి మంచిగా మాట్లాడకపోతే ఎలా అని నిందించారు.
తాజాగా శ్రీకాకుళంలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తూ ధర్మాన అన్న మాటలు ఆసక్తిని రేకెత్తించాయి. మీరు ఓటు ఇష్టం ఉంటే వేయండి కష్టంగా ఉంటే వేయవద్దు కానీ విపక్షాల మాటలను నమ్మవద్దు అని అర్ధించారు. తెలుగుదేశం పార్టీని అనుకూలంగా మీడియా చేస్తున్న చెడు ప్రచారం అసలు నమ్మవద్దు అని కోరారు.
తెల్లారి లేచి టీవీలలో వచ్చిన వార్తలను పేపర్లలో వచ్చిన వాటిని చూసి ఏమీ తెలియని జనం అదే నిజమనుకుంటున్నారని ధర్మాన నిర్వేదం చెందారు. మీరు కళ్లకు కనిపిస్తున్న వాస్తవాలను చూడడం, వాటిని బేరీజు వేసుకోండి మంచి పని చేసిన వారికి చప్పట్లు కొట్టాలన్న ఆలోచన లేని గొప్ప హృదయం మనది అని కూడా ఆయన జనాలను నిందించారు.
జగన్ పేదల కోసం అధికారులను ఎంతలా ఆదేశించి ముందుకు తీసుకువెళ్తారో మీకు తెలియదు, జగన్ని ఒక సైకో అని పిచ్చోడు అని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. నిజంగా జగన్ అలాంటి వారు అయి ఉంటే పేదలకు ఇన్ని పధకాలు అమలు చేసి ఉండేవారా అని ధర్మాన సూటిగా ప్రశ్నించారు.
జగన్ అన్న నాయకుడు లేకుండా ఉంటే పేదలకు ఈపాటి న్యాయమైనా జరిగేదా ఆలోచించడని ఆయన కోరారు. జగన్ మీద విపక్షాలు అదే పనిగా ఆడిపోసుకుంటున్నాయని రాష్ట్రాన్ని తగలెట్టేశాయని పెడబొబ్బలు పెడుతున్నాయని, పేదలకు పధకాలు ఇవ్వడం, వారిని ఆర్ధికంగా పరిపుష్టి చేయడమేనా రాష్ట్రాన్ని తగలెట్టడం అంటే అని ఆయన ఘాటుగానే నిలదీస్తున్నారు.
ఇవన్నీ చూస్తూంటే ధర్మాన తమ పాలన గురించి తాము చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామన్న ఆవేదనతోనో లేక జనాలు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నారన్న ఆందోళనతోనే మాట్లాడుతున్నారనే అనిపిస్తోంది. రాజకీయాలు అంటే ఓట్లు పదవులు కాదు, చెప్పిన మాటను గౌరవించి జనాలకు మేలు చేయడం, జగన్ అది చేస్తున్నారు, మీ ఇంట్లో జగన్ వల్ల ఎంత లబ్ధి కలిగింది అన్నది గుర్తుంచుకుంటే ఆయనకే ఓట్లేస్తారు. లేక విపక్షాల మాట వింటే మీ ఇష్టమని ఆయన ఒక దశలో వైరాగ్యంతో కూడిన హెచ్చరికలు కూడ చేశారు.
ఈ పెద్దాయన నిర్వేదనను జనాలు అర్ధం చేసుకుంటారా అధినాయకత్వానికి ఆయన ప్రసంగాల శైలిలో వాడి వేడి అవగతమవుతున్నాయా ఇతర నేతలకు ఆయన ఏమి చెబుతున్నారో అవగాహనకు వస్తోందా ఇవన్నీ ప్రశ్నలే. కానీ ధర్మాన మాత్రం జగన్ చేసిన మంచిని పదే పదే చెబుతున్న మంత్రిగా కనిపిస్తున్నారు. విన్న వారిది వారి ఇష్టం. వినని వారిది వారి ఖర్మం అన్నట్లుగానే ఆయన చెప్పుకుంటూ పోతున్నారు.