ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ నేర్చుకున్న పాఠం?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. సినిమా అభిమానులకు కొరటాల శివ మీద నమ్మకం వుంది. ఆచార్య డిజాస్టర్ పూర్తిగా కొరటాల వైఫల్యం కాదు, ఇంకేదో వుంది అని నమ్ముతున్నారు. అందుకే కొరటాల…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. సినిమా అభిమానులకు కొరటాల శివ మీద నమ్మకం వుంది. ఆచార్య డిజాస్టర్ పూర్తిగా కొరటాల వైఫల్యం కాదు, ఇంకేదో వుంది అని నమ్ముతున్నారు. అందుకే కొరటాల కసిగా బౌన్స్ బ్యాక్ అవుతారు.. అది దేవర సినిమాతో అని ఆసక్తిగా వున్నారు. ఈ సినిమా విడుదల 2024 సమ్మర్ వేళకు. అందువల్ల ఇప్పట్లో ఆ సినిమా నుంచి పెద్దగా అనౌన్స్ మెంట్ లు ఏవీ ఎక్స్ పెక్ట్ చేయడం లేదు. కానీ అలాంటి వేళ ఉరుము లేని పిడుగులా వచ్చి పడింది రెండు భాగాలు అంటూ.

ఇది నిజంగా కొంత వరకు షాక్ నే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో కూడా రెండు భాగాల సినిమా చేస్తున్నాడు అని హ్యాపీ ఫీల్ అయితే కావచ్చు. కానీ ముందుగా రెండు భాగాల సినిమా అని అనౌన్స్ చేయడం అన్నది ఎప్పుడూ సరైన నిర్ణయం కాదు. కానీ ఎన్టీఆర్ సరైన నిర్ణయమే తీసుకున్నారు అనుకోవాలి. ఎలా?

అసలు రెండు భాగాలు అనే కాన్సెప్ట్‌ను అలవాటు చేసిన బాహుబలి సినిమా విడుదలకు ముందు లాస్ట్ మినిట్‌లో తప్పని సరి కావడంతో, సినిమా లెంగ్త్ బాగా పెరగడంతో ఈ కొత్త ట్రాక్ కు తెర తీసింది. పుష్ప సినిమా కూడా అంతే. తీసిన సినిమా లెంగ్త్ ఎక్కువ వుండడం, తీయాల్సిన కథ ఇంకా చాలా వుండడంతో ఆ దారి పట్టింది. ఇక ఆ తరువాత చాలా సినిమాలు మధ్యలోకి వచ్చాకో, చివరికి వెళ్లాకో రెండు భాగాలుగా మారుతున్నాయి.

దీనికి తోడు కొత్త కాన్సెప్ట్ వచ్చి చేరింది. సినిమాను ముగించేస్తూనే, రెండో భాగానికి అవకాశం వుండేలా ఓ పాయింట్ ను టచ్ చేసి వదలడం. అలా చేయడం ద్వారా సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే మరో సినిమాకు ఆప్షన్ ఓపెన్ గా వుంచుకుంటున్నారు. నిజానికి ఇది కాస్త బెటర్ వే అనుకోవాలి. కానీ పెదకాపు లాంటి సినిమాలు తొందరపడి ముందే రెండు భాగాలు అని ప్రకటించిన బోల్తా పడిన సందర్భాలు కూడా వున్నాయి.

మళ్లీ వర్తమానానికి వచ్చి, దేవర సంగతి చూస్తే..

ఆర్ఆర్ఆర్ కారణంగా ఎన్టీఆర్ కెరీర్‌లో విలువైన టైమ్ చాలా వరకు ఖర్చయిపోయింది. కానీ పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఆ దిశగా ప్రయాణం మొదలైంది. ఇలాంటపుడు చకచకా సినిమాలు చేయాలి, కెరీర్‌ను పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఆ ఇమేజ్ వృధా అవుతుంది. ప్రభాస్ ఉదంతమే తీసుకోండి, బాహుబలితో ఎవరికీ రానంత ఇమేజ్ వచ్చింది. కానీ ప్రయోజనం లేకుండా అవుతోంది. సినిమా సినిమాకు గ్రాఫ్ దిగజారుతోంది. ఇప్పుడు సలార్ అనే సినిమా మీదే ఆశలు అన్నీ. ఆ తరువాత ప్రాజెక్ట్ కె. కానీ విపరీతమైన డిలే అవుతోంది.

ఎన్టీఆర్ ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా వుండాల్సి వుంది. బహుశా అందుకే కావచ్చు. దేవర సినిమాను ఎక్కడ వరకు వస్తే అక్కడ పాజ్ బటన్ నొక్కి వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలకు వెళ్లిపోతున్నారు. దేవర సినిమా తరువాత చేయాల్సిన సినిమాలు ఆ రెండూ. కానీ దేవర సినిమానే చెక్కుతూ కూర్చుంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది. దాని వల్ల సినిమాలు ప్లానింగ్ పూర్తిగా దెబ్బతింటుంది. 

ప్రభాస్ చేసిన తప్పు అదే. పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసి, సినిమాలు పూర్తి చేయకపోవడం. దేవర సినిమా షూట్ చకచకా జరుగుతోంది కానీ, ఇప్పటి ఎక్కువగా సిజి లు అవసరం పడే యాక్షన్ బ్లాక్స్ మాత్రమే ఫినిష్ చేసారని బోగట్టా. వీటిని కలుపుతూ కొంత టాకీ చేయాలి. ఆ తరువాత కథను ముందుకు నడపాలి. ఇదంతా చేయాలి అంటే ఇంకా చాలా సమయం పడుతుందని టాక్.

అలా అయితే వార్ 2 సినిమాకు ఇచ్చిన డేట్ లు మురిగిపోతాయి. ప్రశాంత్ నీల్ రెడీగా వున్నారు. ఆయన వేరే సినిమా మీదకు వెళ్లి పోయే ప్రమాదం వుంది. అందుకే దేవర సినిమాను రెండు భాగాలుగా మార్చాలన్న ఐడియా. కీలకమైన కథను మాగ్జిమమ్ చెప్పేసి, జనాలను ఇబ్బంది పెట్టనంత వరకు తీసుకెళ్లి, అక్కడ పాజ్ బటన్ నొక్కి రెండో భాగం అంటూ క్లోజ్ చేస్తే ఏ ఇబ్బందీ వుండదు. అలా అని దేవర రెండో భాగమే వెంటనే చేసినా ఇబ్బందే. ముందుగే వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు చేసేసిన తరువాత దేవర రెండో భాగం చేయచ్చు.

కళ్యాణ్ రామ్ ఫార్ములా ఇదే. బింబిసార ఫస్ట్ పార్ట్ పెర్ ఫెక్ట్ గా క్లోజ్ చేసారు. రెండో భాగం కథ తయారు అయ్యేలోగా రెండు మూడు సినిమాలు ఫినిష్ చేయాలనుకుంటున్నారు. దేవర రెండో భాగం కథ, ప్రీ ప్రొడక్షన్ కు ఎలా లేదన్నా ఏడెనిమిది నెలలు పడుతుంది. ఈలోగా వార్ 2 ను ఫినిష్ చేసేయవచ్చు. లేదూ బై మిస్టేక్, బై బ్యాడ్ లక్ దేవర ఆకట్టుకోలేదు అనుకున్నా సమస్య లేదు. ఎందుకంటే దేవర విడుదల టైమ్ కే వార్ 2 చాలా వరకు రెడీ అయిపోతుంది. లైనప్ చెడిపోదు.

మొత్తానికి చూస్తుంటే కెరీర్ లైనప్ మీద ఎన్టీఆర్ గట్టి దృష్టి నే పెట్టినట్లు కనిపిస్తోంది.