బహుశా తమ కుల పెద్ద చంద్రబాబునాయుడికి ఇంతకంటే కష్టకాలం వస్తుందని ఆయన సామాజిక వర్గంలోని కొందరు అనుకోవడం లేదు. అందుకే ఈ కష్ట సమయంలో బాబు కోసం అండగా నిలవాలని పార్టీలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి కొందరు తెరపైకి వస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు, చంద్రబాబు వీరాభిమాని సుజనా చౌదరి తమ ఆరాధ్య నేతకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.
బీజేపీ సీనియర్ నాయకుడైన ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలంటూ ఎల్లో చానల్ డిబేట్‌లో మాట్లాడ్డం ఆయనకే చెల్లింది. ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది మరెవరో కాదు…చంద్రబాబు పరమ భక్తుడైన మీడియా అధినేత వేమూరి రాధాకృష్ణ. కుల పెద్ద కోసం ఒక కులనాయకుడు, మరో కుల జర్నలిస్టు & మీడియాధిపతి ‘బిగ్ డిబేట్’ నిర్వహించడం గమనార్హం. చంద్రబాబుపై ఆర్కే ఎప్పుడూ తన మనసులో మాటను దాచుకోలేదు. ఇందుకు ఆయన్ను అభినందించాలి. కానీ చంద్రబాబును వెనకేసుకొచ్చేందుకు తమ కులానికి చెందని తటస్థుడు దొరకలేదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
చంద్రబాబు లాంటి మహానేతను అవినీతి కేసులో అరెస్ట్ చేయడం మహాపరాధం అన్నట్టుగా ‘కమ్మ’ని చర్చ నిర్వహించారు. ఈ చర్చ తమ వాళ్లకు తప్ప, మరొకరికి నచ్చదని వారు గ్రహించినట్టు లేదు. యూట్యూబ్‌లో ఈ చర్చకు సంబంధించి పది గంటల్లో కేవలం 44 వేల వ్యూస్ మాత్రమే వచ్చాయంటే, నిరాదరణను అర్థం చేసుకోవచ్చు. ఆర్కే మొట్ట మొదటి ప్రశ్నే…డిబేట్ దురుద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. చౌదరి గారు అంతర్మథనం చెందుతున్నట్టున్నారనే ప్రశ్న సంధించడం ద్వారా సుజనాచౌదరి మొదటి తమ కుల నాయకుడు, ఆ తర్వాతే బీజేపీ అనే సంకేతాలు ఇచ్చినట్టైంది.
చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే, బీజేపీకి చెందిన సుజనా చౌదరి అంతర్మథనం చెందాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అంటే బీజేపీలో కొనసాగుతూ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమో పని చేస్తున్నామని చెప్పకనే చెప్పారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి వెల్లడించిన ఓ కీలక అభిప్రాయం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
‘జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తాను చేసే తప్పులను మరొకరి మీద రుద్దుతున్నారు. తద్వారా రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేకుండా చేస్తున్నారు. రాజకీయ వైఖరిపై అస్పష్టతతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విపత్కర పరిస్థితుల్లో ఉన్న మాట వాస్తవమే. కేంద్ర నాయకత్వం తన మనసులో ఉన్న ఆలోచనలపై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల మాకు కొంత ఇబ్బంది కలుగుతోంది. వాళ్లు కొన్ని మాకు చెబుతున్నారు. కొన్ని చెప్పడం లేదు. ఇప్పుడు ఏపీలో బీజేపీ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోవడానికి కేంద్ర నాయకత్వం కూడా కొంత వరకూ కారణమే’
ఏపీలో బీజేపీ బలహీనపడడానికి కారణం అని చెప్పగానికి కొంచెమైనా సిగ్గుండాలని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు. బీజేపీ బలహీన పడడానికి టీడీపీ నుంచి వలస వెళ్లి, చంద్రబాబు కోసం పనిచేస్తున్న సుజనాచౌదరి, సీఎం రమేశ్ తదితర నేతలే కారణమని ఏపీ సమాజం కోడై కూస్తోంది. టీడీపీ అనుకూల చానల్‌కు వెళ్లి, చంద్రబాబు కోసం వ్యక్తిగతంగా మాట్లాడ్డం ఏంటి? ఇదెక్కడైనా వుంటుందా? చంద్రబాబు ఎంతో గొప్ప నాయకుడనే భావన వుంటే బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమొచ్చిందో మొదట సుజనా చౌదరి సమాధానం చెప్పాలి.
బీజేపీలో వుంటూ, మనసంతా చంద్రబాబుపై ప్రేమ నింపుకుని, నిత్యం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచించడం వల్ల ఆ పార్టీ దెబ్బతిందని జగమెరిగిన సత్యం. చంద్రబాబును అరెస్ట్ చేయడంలో మోదీ సర్కార్ ప్రమోయం వుందని మెజార్టీ పౌర సమాజం నమ్ముతోంది. అదే పార్టీకి చెందిన సుజనాచౌదరి లాంటి వాళ్లు మాత్రం తమ కుల చానళ్ల డిబేట్లలో మాత్రం మరెవరినో విమర్శిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడాన్ని ప్రజానీకం గమనిస్తోంది.
కనీసం అరశాతం ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీకి అది కూడా లేకుండా సర్వనాశనం చేసేందుకే సుజనాచౌదరి లాంటి చంద్రబాబు వీరాభిమాన నాయకులు కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. చివరికి సొంత పార్టీని కూడా విమర్శించడానికి సుజనా వెనుకాడడం లేదంటే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆశీస్సులు లేవని ఎలా నమ్మడం?