పోసాని కృష్ణమురళి… దూరం దూరం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో టాలీవుడ్ పెద్ద‌ల భేటీ ముగిసింది. భేటీ అనంత‌రం సినీ పెద్ద‌లు మీడియాతో మాట్లాడుతూ అంతా హ్యాపీ అని ప్ర‌క‌టించారు. ఆరేడు నెల‌లుగా వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గం దొరికింద‌ని,…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో టాలీవుడ్ పెద్ద‌ల భేటీ ముగిసింది. భేటీ అనంత‌రం సినీ పెద్ద‌లు మీడియాతో మాట్లాడుతూ అంతా హ్యాపీ అని ప్ర‌క‌టించారు. ఆరేడు నెల‌లుగా వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గం దొరికింద‌ని, పెద్ద మ‌న‌సుతో ఆలోచించిన సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జ‌గ‌న్‌తో భేటీ అనంత‌రం ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి మీడియాతో మాట్లాడ‌కపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సీఎం వైఎస్ జగన్‌తో టికెట్‌ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌లు చ‌ర్చించారు.ఈ చ‌ర్చ‌ల్లో  చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్‌ నారాయణ మూర్తి, నిరంజన్‌ రెడ్డి, అలీ త‌దిత‌రులు పాల్గొన్నారు. దాదాపు గంట‌కు పైగా జ‌గ‌న్‌తో సుహృద్భావ వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. భేటీ అనంత‌రం వారంతా మీడియా ముందుకొచ్చారు.

పోసాని కృష్ణ‌ముర‌ళి మిన‌హా మిగిలిన అంద‌రూ క‌నిపించారు. మీడియాతో చిరంజీవి, మ‌హేశ్‌బాబు, రాజ‌మౌళి, ప్ర‌భాస్‌, ఆర్‌.నారాయణమూర్తి, మంత్రి పేర్ని నాని మాట్లాడి స‌మావేశ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సినీ పరిశ్రమ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్‌ చిరంజీవి ప్ర‌క‌టించారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్‌ తీసుకున్నారని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అని  చిరంజీవి తెలిపారు.

కానీ పోసాని మీడియా ముందుకు రాక‌పోవ‌డానికి ప్ర‌త్యేకంగా కార‌ణాలు ఏవైనా ఉన్నాయా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కొంత కాలం క్రితం ప‌వ‌న్ అభిమానులు, పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో గొడ‌వ జ‌రిగింది. సినీ స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని పోసాని ఖండించారు. 

ప‌వ‌న్‌పై పోసాని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు పోసాని కుటుంబ స‌భ్యుల‌ను దూషిస్తూ వ్య‌క్తిగ‌త మెసేజ్‌లు, సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్ప‌డ్డారు. ప‌వ‌న్ త‌న అభిమానుల‌ను నియంత్రించుకోవాల‌ని, లేదంటే తాను కూడా అదే స్థాయిలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతాన‌ని అన్నంత ప‌ని చేశారు. అనంత‌రం పోసాని ఇంటిపై ప‌వ‌న్ అభిమానులు దాడికి తెగ‌బ‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పెద్ద‌న్న చిరంజీవి కీల‌క పాత్ర పోషిస్తున్న స‌మావేశంలో పోసాని పాల్గొన‌డం స‌హ‌జంగానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. చిరంజీవి బృందంతో సంబంధం లేకుండా పోసాని ఈ స‌మావేశానికి ప్ర‌త్యేకంగా హాజ‌రయ్యారు. అలాగే మీటింగ్ త‌ర్వాత కూడా వారితో క‌ల‌వ‌క‌పోవ‌డం… ఇటీవ‌ల ప‌వ‌న్‌తో విభేదాలే కార‌ణ‌మై ఉండొచ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.