కాలేజీల్లో హిజాబ్ లు కొత్త కాదు. ముస్లింల జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ల అమ్మాయిలు వీటి ధారణతోనే కాలేజీలకు వస్తూ ఉంటారు. హైదరాబాద్ వంటి చోట డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లు ఇలాంటివి చూసే ఉంటారు. ఇక ఓ మోస్తరు పట్టణాల్లో మాత్రం ఇవంత సీరియస్ గా ఉండవు. ఏపీ వంటి రాష్ట్రాల్లో అయినా, కర్ణాటకలో అయినా.. ఓ మోస్తరు పట్టణాల్లో ముస్లిం యువతులు కూడా వీటిని ధరించరు. ముస్లింలలో కూడా మరీ సంప్రదాయ వాదులే తమ ఆడ పిల్లలు వీటిని ధరించి వెళ్లాలనే ధోరణితో ఉంటారనేది బహిరంగ సత్యం.
ముస్లింలలో కూడా ఈ సంప్రదాయాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే వారి శాతం ఊర్లను బట్టి, ప్రాంతాలను బట్టి మాత్రమే ఉంటుందని కాస్త పరిశీలిస్తే స్పష్టత వస్తుంది. మరి కర్ణాటకలో ఉన్నట్టుండి హిజాబ్ లపై రచ్చ ఎందుకు మొదలైందంటే.. కర్ణాటకలో కొడితే ఉత్తరాదిన జరుగుతున్న ఎన్నికల్లో ప్రయోజనాలను బీజేపీ వెదుక్కొంటోందా? అనే విశ్లేషణ సాగుతూ ఉంది.
యూపీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కు రోజుల ముందు ఈ వివాదం రాజుకుంది. ఒక్కసారిగా ఈ అంశంపై జాతీయ స్థాయి చర్చ సాగుతూ ఉంది. సరిగ్గా యూపీ ఎన్నికల ముందే ఈ అంశాన్ని రాజేశారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
అయితే బీజేపీ ఏ వ్యూహం మేరకు ఈ అంశాన్ని రగిల్చినా.. ఉత్తరాదిన మాత్రం వీటి విషయంలో అంత పట్టింపు లేదని కూడా విశ్లేషకులు అంటున్నారు. మహిళలు పరదాల చాటున ఉండటం మంచిదనే తత్వం ఉత్తరాదిన ఎక్కువ. దానికి మతం మినహాయింపు కాదు! మరి కర్ణాటక నుంచి వ్యక్తం అవుతున్న విముఖత యూపీలో ఎంత వరకూ ఉపయుక్తంగా ఉంటుందో కమలం పార్టీకి!
ఇది వరకూ ముస్లిం మహిళల మీద కమలనాథులు అపారమైన సానుభూతి వ్యక్తం చేశారు. అది తలాక్ విషయంలో. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు చేకూర్చినట్టుగా కమలనాథులు ప్రకటించుకున్నారు. దానికి మద్దతుగా అనేకచోట్ల ముస్లిం మహిళలు కూడా సానుకూలత వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు హిజాబ్ విషయంలో మాత్రం ముస్లిం మహిళలే నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హిజాబ్ తమ స్వతంత్రం అనే మాట వినిపిస్తోంది వారి నుంచి. మరి విడాకుల విషయంలో ముస్లిం మహిళలను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ వాళ్లు, ఈ పరదాల విషయాన్ని వారి స్వతంత్రానికి వదిలేయడం లేదు!