తాను అభిమానించే వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉంటారు. తాను నమ్మిన వాళ్లు, అలాగే తనను నమ్మిన వాళ్లకు అండగా నిలబడడంలో జగన్‌కు జగనే సాటి. తాజాగా ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా జగన్ పరోక్షంగా సందేశాన్ని పంపారు. చిరు అంటే రీల్ హీరో మాత్రమే కాదని, రియల్ హీరో కూడా అని జగన్ చాటి చెప్పారు.
చిత్రపరిశ్రమలో ఏర్పడిన సమస్యలకు చిరంజీవి పెద్దరికంలో పరిష్కారం చూపి, మెగాస్టార్ పరపతిని మరింత పెంచారు. చిరంజీవిపై మొదటి నుంచి జగన్ ప్రత్యేక అభిమానాన్ని చూపుతూ వస్తున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత సతీమణితో కలిసి చిరంజీవి తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. జగన్ ఇంట్లో లంచ్ చేసి వచ్చారు. జగన్, భారతి ఆతిథ్యానికి చిరంజీవి దంపతులు ఫిదా అయ్యారు.
ఇండస్ట్రీ సమస్యలపై నాగార్జున, రాజమౌళి తదితరులతో కలిసి పలుమార్లు చిరంజీవి జగన్ వద్దకెళ్లి చర్చించారు. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి, అండగా నిలిచేందుకు జగన్ సానుకూలంగా ఉన్నట్టు పలు సందర్భాల్లో చిరంజీవి బహిరంగం గానే ప్రకటించారు. తాజాగా సినిమా టికెట్ ధరలు, ఇతర సమస్యలపై చర్చించేందుకు కొందరు సినీ ప్రముఖులతో కలిసి చిరంజీవి సీఎం వద్దకెళ్లారు. ఎట్టకేలకు చివరికి శుభం కార్డు పడిందని స్వయంగా చిరంజీవే ప్రకటించారు.
జగన్‌తో భేటీ అనంతరం హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి , మంత్రి పేర్ని నాని మాటల్లో చిరంజీవి పాత్ర గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమ పెద్ద అంటే చిరంజీవి ఒప్పుకోరని, కానీ ఆయన చర్యలు మాత్రం పెద్దరికానికి సంబంధించినవే అని రాజమౌళి చెప్పడం విశేషం.
మరీ ముఖ్యంగా ఆరేడు నెలలుగా ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో చిరంజీవి కృషితో పరిష్కార మార్గం లభించిందని మహేశ్ బాబు, రాజమౌళి పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్ద సినిమాలను రకరకాల సాకులతో వాయిదా వేసుకోవడాన్ని చూస్తే …మహేశ్‌బాబు, రాజమౌళి మాటల వెనుక అంతరార్థాన్ని పసిగట్ట వచ్చు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి, చివరికి సినిమాలను విడుదల చేసుకోలేని దయనీయ స్థితి. ఈ నేపథ్యంలో నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్, ఇతర నటులు, సాంకేతిక సిబ్బంది మానసిక స్థితి ఎలా వుంటుందో అది అనుభవించే వాళ్లకే తెలుస్తుంది.
అందుకే జగన్‌తో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం వల్ల ఓ పెద్ద సమస్య పరిష్కారం అయ్యిందని రాజమౌళి చెప్పడం. ఈ ఒక్క మాట చాలు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న, గత ఆరేడు నెలలుగా ఎదుర్కొంటున్న సమస్య ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోడానికి. ఇలా ప్రతి అంశంలోనూ చిరంజీవికి క్రెడిట్ దక్కడంలో జగన్ సానుకూల స్పందన…మెగాస్టార్‌పై సీఎం ప్రేమాభిమానాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇటీవల మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి ఆశామాషీ వ్యక్తి కాదన్నారు. తద్వారా చిరంజీవి ఎంతో గొప్పవ్యక్తి అని పేర్ని నాని చెప్పకనే చెప్పారు.
చిరంజీవి అంటే జగన్‌కు ఎంతో గౌరవం అని అన్నారు. తాజాగా చర్చలు సఫలమైన నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు చిరంజీవి కృషి చేశారన్నారు. సినీ సమస్యలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడినా.. మెగాస్టార్ మాత్రం సమస్య పరిష్కారానికి తీవ్ర కృషి చేశారన్నారు. చిరంజీవి ఎంతో పెద్దరికంతో అన్నీ భరిస్తూ కొంత కాలంగా నలుగుతున్న సమస్యలకు పరిష్కారం చూపారని కొనియాడారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ల వ్యవహారంలో అందరి తరపున ప్రభుత్వంతో చర్చలు జరిగేలా దారి చూపినందుకు మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. సినిమా టికెట్ల అంశంలో గత కొద్ది నెలలుగా గందరగోళంలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు పెద్ద ఉపశమనం లభించిందని అన్నారు. రాజమౌళి కూడా ఇదే రీతిలో చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు. హీరో ప్రభాస్, ఆర్.నారాయణమూర్తి తమ ప్రసంగాల్లో చిరంజీవి పెద్దరికాన్ని కొని యాడారు.
అంతిమంగా జగన్ ప్రభుత్వం చిత్రపరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించడానికి ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవే కారణమని అందరూ చెప్పే మాట. తాను అభిమానించే చిరంజీవికి ఇంతకంటే గౌరవం జగన్ ఏం ఇవ్వగలరు. ఇదే సందర్భంలో తన మాటకు విలువ ఇవ్వడం కంటే జగన్ నుంచి చిరు ఏం కోరుకుంటారు? ఏది ఏమైనా చిరును రియల్ హీరోగా జగన్ లోకానికి చూపడంలో విజయవంతం అయ్యారు. అది తన ఆత్మీయుడికి జగన్ ఇచ్చిన గిఫ్ట్.