వారెవ్వా రాజకీయం.. వెల్లువలా ‘పచ్చ’ ఆక్రోశం!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దాదాపుగా ముంచుకువచ్చేశాయి. నేడో రేపో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే అధికార భారాస అబ్యర్థుల జాబితాను కూడా తేల్చేసింది. ఇతర పార్టీలు ప్రకటించకపోయినా.. టికెట్ పై గట్టి నమ్మకం…

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దాదాపుగా ముంచుకువచ్చేశాయి. నేడో రేపో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే అధికార భారాస అబ్యర్థుల జాబితాను కూడా తేల్చేసింది. ఇతర పార్టీలు ప్రకటించకపోయినా.. టికెట్ పై గట్టి నమ్మకం ఉన్న నాయకులు ఆల్రెడీ ప్రచార పర్వంలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాదు నగర పరిధిలోని రాజకీయ నాయకుల్లో పచ్చపచ్చని ఆక్రోశం వెల్లువలా కనిపిస్తోంది. నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా కావొచ్చు గాక.. వారిలో పచ్చప్రేమ పిచ్చపిచ్చగా పొంగుతోంది.

తెలంగాణ- ప్రధానంగా హైదరాబాదు నగరంలో ఆంధ్రోళ్ల ఓట్లు గణనీయంగా ఉంటాయనే సంగతి అందరికీ తెలుసు. కులాల లెక్కలవారీగా చూసినప్పుడు.. ఆంధ్రోళ్లలో కూడా కమ్మ ఓట్లు, తెలుగుదేశాన్ని అభిమానించే వారి ఓట్లు అధికంగా ఉంటాయనేది ఒక అంచనా. ఈ ఓట్లను ఆకర్షించడం, ఆంధ్రోళ్ల ఓట్లకు గేలం వేయడం అనేది ఇప్పుడు ఇక్కడ పోటీచేస్తున్న నాయకుల ప్రధాన టార్గెట్ అయిపోయింది. అందుకు అందరూ చంద్రబాబు భజన చేయడాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు.

ఏపీలో ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని, అధికారుల్ని వాడుకుని, 241 కోట్ల రూపాయలను స్వాహాచేసిన కేసులో చంద్రబాబు అరెస్టు అయి జైల్లో ఉండగా.. తెలంగాణ నాయకమ్మన్యులు ఆయనకు మద్దతుగా కన్నీళ్లు కారుస్తున్నారు. నాయకులు ఏ పార్టీలో ఉన్న వారైనా సరే.. చంద్రబాబు కోసం ఆక్రోశిస్తుండడం ఇక్కడ గమనించాల్సిన సంగతి. 

తెలుగుదేశం తరఫున గెలిచి, గెలిపించిన పార్టీని నట్టేట ముంచేసి భారాసలోకి ఫిరాయించిన ఆరికెపూడి గాంధీ వంటి వారు చంద్రబాబుకోసం, ఆ రూపంలో తమ నియోజకవర్గంలోని కమ్మ ఓట్ల కోసం, కొవ్వొత్తుల ర్యాలీ వంటివి చేస్తున్నారు. బాబు అరెస్టు అన్యాయం, అక్రమం అంటూ నినాదాలతో ఆక్రోశిస్తున్నారు. 

మల్కాజిగిరిలో భారాస సిటింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం కాంగ్రెసులో చేరిన మైనంపల్లి హన్మంతరావు.. హైదరాబాదులో ఆందోళనలు తగవని అన్న కేటీఆర్ మాటలపై బీభత్సంగా ఫైర్ అయ్యారు. చంద్రబాబు వంటి మహానాయకుడి అరెస్టుపై స్పందించి తీరుతామని పలుకుతున్నారు. ఇలా ఓట్ల కోసం పచ్చ ప్రేమను వెల్లువెత్తిస్తున్న నాయకులు అనేకమంది ఉన్నారు.

ఏపీలో ఇన్సిడెంట్ జరిగితే, తెలంగాణలో కూడా ఆందోళనలు సాగడానికి ఇదేమీ ‘దిశ రేప్’ వంటి అన్యాయం అరాచకం కానే కాదు. కానీ.. హైదరాబాదులో ఆందోళనలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నాటకీయ ఆందోళనలను కేటీఆర్ గట్టిగానే ఎద్దేవా చేశారు కూడా. అలా చేసిన మంత్రి కేటీఆర్ ఏమీ తక్కువ తినలేదు. ఆయన డైరక్టుగా చంద్రబాబును పొగడలేరు గనుక.. అదే కమ్మ ఓట్ల కోసం ఆయన ఎన్టీఆర్ ను కీర్తించడం పనిగా పెట్టుకున్నారు. నందమూరి తారకరామారావు మహానుభావుడని ఆయన తన భక్తినంతా ఇప్పుడు హఠాత్తుగా చాటుకుంటున్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాలను గమనిస్తున్న ప్రజలు మాత్రం.. ఔరా ఓట్ల కోసం మీలో ఇంతగా పచ్చప్రేమ వెల్లువెత్తుతోందే అని ఆశ్చర్యపోతున్నారు.