ఆస్కార్ అనేది తనకు రెండో గొప్ప అవార్డ్ అని కీరవాణి ఎప్పుడో ప్రకటించాడు. తన టాలెంట్ గుర్తించి, రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇచ్చిన రోజే తనకు మొదటి ఆస్కార్ వచ్చిందని, నాటు నాటు సాంగ్ కు వచ్చింది రెండో ఆస్కార్ అని గతంలోనే స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఇప్పుడీ సంగీత దర్శకుడు నాటు-నాటు సాంగ్ పై మరో సంచలన ప్రకటన చేశాడు. తన కంపోజిషన్ లో, తనకు నచ్చిన టాప్-100 సాంగ్స్ తీస్తే, అందులో నాటు-నాటుకు స్థానం లేదని ప్రకటించాడు. కెరీర్ లో చాలా సాంగ్స్ ఇష్టపడి చేశానని, కచ్చితంగా హిట్ అవుద్దని భావిస్తే, అవన్నీ ఫ్లాప్ అయ్యాయని, అలా తనకు ఇష్టమైన పాటల లిస్ట్ చూస్తే, అందులో నాటు-నాటు ఉండదని చెబుతున్నాడు కీరవాణి.
ఈ సందర్భంగా రాజమౌళి తీసిన సింహాద్రి సినిమాపై కూడా ఆసక్తికర ప్రకటన చేశాడు కీరవాణి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమాలో ప్రతి పాటను ఓ ఫ్లాప్ సినిమా నుంచి తీసుకొని చేశారట. అలా తను కంపోజ్ చేసిన ఫ్లాప్ సినిమాల నుంచి పాటలు తీసుకొని, వాటిని మార్చి సింహాద్రిలో పెట్టామని తెలిపాడు కీరవాణి.
“రాజమౌళితో సింహాద్రి అనే సినిమా చేశాను. అందులో రికార్డ్ చేసిన పాటలన్నీ ఫ్లాప్ పాటలే. అంతకుముందు కొన్ని సినిమాల్లో వచ్చినవే. సింహాద్రిలో ప్రతి పాట ఓ ఫ్లాప్ సాంగ్. అయితే ఆ పాటల వాల్యూ రాజమౌళికి తెలుసు. నేను మరింత బాగా ప్రజెంట్ చేస్తానని తెలుసు. అందుకే ఏరికోరి ఆ ఫ్లాప్ పాటల్ని, కంపోజిషన్ మార్చి నాతో పెట్టించాడు. చిన్నదమ్మే చీకులు కావాలా అనే పాట సమర్పణ అనే సినిమాలోనిది. మిగతా పాటలు కూడా ఫ్లాప్ సినిమాల నుంచి తీసుకున్నవే.”
ప్రస్తుతం తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయని తెలిపిన కీరవాణి, ఆస్కార్ అవార్డ్ వచ్చిందని తనను చాలామంది సంప్రదిస్తున్నారని, అది తనకు చాలా బాధ కలిగిస్తోందన్నాడు. ఆస్కార్ అవార్డ్ రాకముందు కూడా తనలో టాలెంట్ ఉందని, అది గుర్తించి వస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.