ప్రపంచవ్యాప్తంగా వైన్ ప్రియులున్నారు. ఎంత ఓల్డ్ వైన్ తాగితే అంత గొప్ప. రేటు కూడా అదే విధంగా ఉంటుంది. మరి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైన్ ఏది? దీనికి సమాధానంగా నిలిచింది జర్మనీలో కనుగొన్న ఓ వైన్.
జర్మనీకి చెందిన స్పెయర్ నగరంలో రోమన్ సమాధుల్లో ఓ వైన్ బాటిల్ ను కనుగొన్నారు. పూర్వకాలం రోమన్ సమధుల్లో ఇలా వైన్ బాటిల్స్ పెట్టడం ఆనవాయితీ. అలా పెట్టిన 16 బాటిళ్లలో 15 చెడిపోగా..ఇదొక్కటే మిగిలింది. అదే ప్రపంచంలోని అత్యంత పురాతనమైన వైన్.
ఈ వైన్ వయసు అక్షరాలా 1650 సంవత్సరాలుగా తేల్చారు నిపుణులు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ వైన్ ను తాగొచ్చంట. ఏమాత్రం చెడిపోకుండా శుభ్రంగా ఉందంట. కేవలం సీసా మాత్రమే పాడుబడిందని, లోపల వైన్ మాత్రం స్వచ్ఛంగా ఉందని చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎవ్వరూ దీన్ని టేస్ట్ చేయలేదు.
క్రీ.శ 325-359 సంవత్సరాల మధ్య ఈ వైన్ ను తయారుచేసినట్టు గుర్తించారు. బయటగాలి బాటిల్ లోపలకు చొరబడకుండా ఆలివ్ ఆయిల్ తో మూతను కప్పిన విధానం శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
వైన్ ప్రొఫెసర్ మోనికా క్రిస్టమన్ ఈ బాటిల్ ను అధ్యయనం చేశారు. మైక్రో-బయలాజికల్ ప్రకారం, ఈ వైన్ కలుషితం కాలేదని ఆమె ప్రకటించారు. అయితే ఇప్పుడున్న వాతావారణ పరిస్థితుల్లో ఈ వైన్ ను టేస్ట్ చేయకపోవడమే మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.
మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతన వైన్ బాటిళ్లపై అధ్యయనం చేసి, అత్యంత పాత వైన్ గా ఈ బాటిల్ కు గుర్తింపునిచ్చారు నిపుణులు.