చిన్నప్పుడు తను ఎస్సై అయిపోయి, ప్రజలను రక్షించాలని కలలు కన్నట్టుగా సెలవిచ్చారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్! ఇది వరకూ పవన్ ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్పారు! తనకు అనిపించిన వాటి గురించి, తన కలల గురించి చెప్పుకుంటూ ఉండటం పవన్ కు కొత్త కాదు.
మధ్యలో ఎంపీసీ ముచ్చట కూడా ఒకసారి వచ్చినట్టుంది. తనకు అర్థం అయ్యేలా మ్యాథ్స్ ఎవ్వరూ చెప్పలేకపోయారని కూడా పవన్ చెప్పినట్టుగా ఉన్నారు. తను అడిగే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోవడంతో చదువు పై అలిగినట్టుగా ఒక సారి చెప్పుకొచ్చారు. ఇంటర్మీడియట్ లో తను చదివిన గ్రూప్ విషయంలోనే రెండు మూడు రకాలుగా చెప్పిన ఘనత పవన్ కల్యాణ్ ది. బహుశా ఎక్కువ చదివేసి.. ఏం చదివందీ గుర్తులేదేమో!
ఇక తన ఇంట్లో చట్టాల గురించి, రాజకీయం గురించి చర్చ జరిగేదని.. రాజకీయ వాతావరణంలో పెరగడం వల్ల తనలో సామాజిక స్పృహ పెరిగిందని పవన్ సెలవిచ్చారు! ఏ ముఖ్యమంత్రి కొడుకో, ఏ మంత్రిగారి కొడుకో కూడా తన ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండేదని చెప్పరు. అలాంటిది పవన్ కల్యాణ్ నేపథ్యానికి, తన ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండేదని చెప్పడానికి సాపత్యం ఏమిటో ఆయనకే తెలియాలి!
ఇక నెల్లూరంటే తనకు ఇష్టమని పవన్ చెప్పారు. ఏ ఊరికి వెళితే ఆ ఊరు తనకు ఇష్టమని చెప్పడం కూడా పవన్ కు కొత్తేమీ కాదు. రాయలసీమకు వెళితే కర్నూలే తన దృష్టిలో రాజధాని అని, ఆ తర్వాత అమరావతికి వెళ్లి అమరావతే రాజధానిగా ఉండాలని.. ఇలాంటి మాటలు విని ఏపీ జనాల చెవుల తుప్పు వదిలించారు జనసేన అధిపతి.
చిన్పప్పుడే కాదు.. కొంతమందికి ఒక వయసు వచ్చాకా కూడా ఏది నచ్చితే అది అయిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్లు ఊహాలోకంలో ఉండే టైపు. కాసేపు పోలీస్ కావాలని, మరి కాసేపు రాజకీయ నేత అని, ఇంకాసేపు సినిమా హీరో అని, ఇంకోసారి క్రికెటర్ అని.. ఇలా మనసుకు ఏది బాగనిపిస్తే అది కావాలనుకుంటూ ఉంటారు. అయితే అంతిమంగా వీళ్లు ఏదీ కాలేరు, తమ వృత్తినీ ఆస్వాధించలేరు! బహుశా పవన్ కల్యాణ్ చెప్పే కబుర్లు వింటే. ఈయన కూడా అదే టైపేమో అని మానసిక విశ్లేషకులు అంటున్నారు.
అయినా నువ్వేం కావాలనుకున్నావో జనాలకు ఎందుకు పవన్? నువ్వు ఏమయ్యావనేది ఇంపార్టెంట్ కానీ! ఒట్టి సినిమా హీరోగా తనను జనాలు ఆమోదించరని.. అది కావాలనుకున్నట్టుగా, ఇది కావాలనుకున్నట్టుగా చెప్పుకుంటే.. తననో అపరమేధావిగా గుర్తిస్తారనేది పవన్ లెక్కేమో!