అమ్మాయిలను మోసం చేయడం అతని హాబీ. ఇందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా వాడుకున్నాడు. ఇలా ఒకరిద్దరు కాదు …ఆరుగురు అమ్మాయిలను ప్రేమ పేరుతో వల్లో వేసుకున్నాడు.
చివరికి అతనికి భార్యే తగిన బుద్ధి చెప్పేందుకు నడుం కట్టింది. ఆ కుర్రకారుకు భార్య కర్ర కాల్చి వాతలు పెట్టింది. ఫేస్బుక్లో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసగిస్తున్న ఆ పోకిరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కుర్ర విజయభాస్కర్‌కు ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపడం బాగా తెలుసు. చివరికి మోసపోయామని అమాయక అమ్మాయిలు లబోదిబోమనేవాళ్లు. ఈ నేపథ్యంలో అతని ఆట కట్టించేందుకు భార్య సౌజన్య ముందుకొచ్చింది.
హైదరాబాద్ నగరానికి చెందిన కుర్ర విజయభాస్కర్‌కు 2017లో సౌజన్యతో పెళ్లైంది. జల్సాలకు అలవాడుపడిన విజయభాస్కర్ డబ్బు కోసం భార్యను వేధించేవాడు. డబ్బు ఇవ్వకుంటే మరో పెళ్లి చేసుకుంటానని భార్యను బెదిరించేవాడు.
ఈ నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించడానికి చెడుమార్గాలను పట్టాడు. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిలతో పరిచయం పెంచుకునేవాడు. తాను ఉన్నత ఉద్యోగినని నమ్మబలికేవాడు. అలా స్నేహాన్ని పెంచుకుని మెల్లిగా ప్రేమ పేరుతో తనవైపు తిప్పుకునేవాడు.
నువ్వంటే చాలా ఇష్టమని, నువ్వు లేకపోతే జీవితం లేదని అమ్మాయిలకు మాయ మాటలు చెప్పేవాడు. అతని మాటలు నిజమేనని నమ్మిన అమ్మాయిలు …ఆ తర్వాత అతను అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాళ్లు.
చివరికి తాము మోసపోయామని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత లబోదిబోమనేవాళ్లు. ఇలా ఆరుగురు యువతులు అతని మాయమాటలకు మోసపోయి ఆర్థికంగా నష్టపోయారు. భర్త అరాచకాలను, మోసాలను చూస్తూ చూస్తూ సౌజన్య భరించలేకపోయింది.
ఒకరోజు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అని తనను నమ్మించి పెళ్లి చేసుకున్నాడని, మూడేళ్లుగా ప్రత్యక్ష నరకం చూపుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో విజయభాస్కర్ మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీంతో మరింత మంది అతని మోసానికి బలి కాకుండా అరికట్టినట్టైంది.