తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బహుశా ఈ రాజీనామా తొలి సారి కాకపోవచ్చు. హుజూర్ నగర్ బై పోల్ లో కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకున్నప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినట్టుగా ఉన్నారు. అయితే ఆ రాజీనామా పత్రాన్ని తీసుకోవడానికి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడే లేనట్టున్నారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి బాధ్యత వహిస్తూ మరోసారి ఉత్తమ్ రెడ్డి రాజీనామా చేశారట. అంతే కాదు.. వీలైనంత త్వరగా మరొకరిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కూడా ఉత్తమ్ ఏఐసీసీని కోరారట. అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తి స్థాయి అధ్యక్షుడే లేరు! జాతీయాధ్యక్షుడి విషయంలోనే కాంగ్రెస్ ఏం తేల్చుకోలేకపోతోంది. ఆ బాధ్యతలను వదిలి రాహుల్ పారిపోగా.. సోనియా ఎలాగైనా రాహుల్ ను ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి తన వద్దనే ఆ పదవిని పెట్టుకున్నారు. మరి ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తారనేది ఇంకా సమాధానం లేని ప్రశ్నే.
ఇలాంటి నేపథ్యంలో టీపీసీసీకి అధ్యక్షుడిని నియమించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అందుకే.. ఇప్పుడు కూడా ఉత్తమ్ రాజీనామా పై ఢిల్లీ నుంచి ఇప్పుడప్పుడే ప్రతిస్పందన రాకపోవచ్చేమో!
ఆ సంగతలా ఉంటే.. ఉత్తమ్ రాజీనామా నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ గట్టిగా ఉండేలా ఉన్నట్టుంది. ఆ పదవి మీద కోమటిరెడ్డి సోదరులు తమ ఆశలను బహిరంగంగానే ప్రకటించారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారట. ఈ నేపథ్యంలో వీరిలో ఎవరికి ఆ పదవి దక్కుతుందనేది ఆసక్తిదాయకమైన అంశం. అలాగే ఎవరికి దక్కినా మరొకరు సహకారం అందించకపోవడమో, అలగడమో జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు!