టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. విజయాల జైత్ర యాత్ర కొనసాగిస్తున్న బీజేపీ …నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ అదే ఊపు కొనసాగించేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.
ఇందులో భాగంగా ఆ నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డిని పార్టీలో చేర్చుకుని బరిలో నిలిపేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ మేరకు ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు జరిపినట్టు ప్రచారం సాగుతోంది.
2019లోనే జానారెడ్డి కుమారుడు బీజేపీలో చేరుతారని, ఆయనకు నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో చివరి నిమిషంలో చేరిక ఆగిపోయింది.
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు జానారెడ్డి మొగ్గు చూపుతున్నారని తెలిసింది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం అవతరించింది. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున జానారెడ్డి బరిలో నిలిచి తన సమీప టీడీపీ అభ్యర్థి చిన్నపురెడ్డిపై 6,214 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు.
ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 16,476 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నోముల చేతిలో 7,771 ఓట్ల తేడాతో జానారెడ్డి ఓటమిపాలయ్యారు. ఓటమితో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్న నేపథ్యంలో జానారెడ్డి క్రియాశీలకంగా లేరు.
ఒకప్పుడు హోంమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో జానారెడ్డి ఓ వెలుగు వెలిగారు. పెద్ద మనిషిగా, మృధుస్వభావిగా పేరున్న జానారెడ్డి, ఆయన కుమారుడిని పార్టీలో చేర్చుకోవడం వల్ల కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోవచ్చని బీజేపీ పెద్దలు గట్టిగా నమ్ము తున్నారు.
2018లో బీజేపీ తరపున కంకణాల నివేదిత పోటీ చేసి కేవలం 2,675 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 46.34%, కాంగ్రెస్ 42.04%, బీజేపీ 1.48% ఓట్లు దక్కించుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జానారెడ్డిని కుటుంబాన్ని చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలాన్ని తనవైపు తిప్పుకోవచ్చని బీజేపీ ప్లాన్‌గా చెబుతున్నారు. జానారెడ్డి లేదా ఆయన కుమారుడిని ఉప ఎన్నిక బరిలో నిలిపే అవకాశాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
1975లో రాజకీయాల్లో అడుగు పెట్టిన జానారెడ్డి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికల్లో పోటీ చేయగా ఏడుసార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన కంకణాల నివేదిత భర్త శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా బీజేపీ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
జానారెడ్డి కుటుంబం పార్టీలో చేరితే ఉప ఎన్నికకు అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పనిలేకపోవడంతో పాటు అధికార టీఆర్ఎస్‌కు మరోసారి ఓటమి రుచి చూపించవచ్చని బీజేపీ పెద్దలు ఉత్సాహంగా చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి.
నర్సింహయ్య అనారోగ్యానికి గురైనప్పటి నుంచి ఆయన తనయుడు భగత్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో తేరా చిన్నపురెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అధికార పార్టీలో రెండుమూడు గ్రూపులు టికెట్ తమకంటే తమకని ఇప్పటి నుంచే లడాయి మొదలు పెట్టాయి.
టీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు తమ గెలుపునకు దోహదపడుతాయని బీజేపీ అంచనా వేస్తోంది. ఏది ఏమైనా మరో ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది.