ఏపీ రాజకీయ నేతలతో రజనీకాంత్ అనుబంధం ఇప్పటిదేమీ కాదు. రాజకీయ కలలు గని, అదిగో పార్టీ, ఇదిగో పార్టీ అంటూ హడావుడి చేసి, చివరకు ఎందుకో సొంత పార్టీ ఆలోచనను విరమించుకున్న ఈ సూపర్ స్టార్ తెలుగు రాజకీయ నేతలతో మాత్రం గతంలో కొంత సఖ్యతతో గడిపారు. ప్రత్యేకించి సీనియర్ ఎన్టీఆర్ తో రజనీకి రాజకీయ సఖ్యత ఉండేదనే పేరుంది.
అయితే ఎన్టీఆర్ ను దించేసిన సందర్భంలో రజనీకాంత్ మాత్రం ఆయనకు అండగా నిలవలేదు. చంద్రబాబు గ్రూపుతోనే రజనీకాంత్ కూడా కనిపించారు మీడియాకు. అయితే ఎన్టీఆర్ మరణించిన తర్వాత సూటు కేసులను పట్టుకెళ్లిన వారిలో రజనీకాంత్ కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. ఎన్టీఆర్ మరణించిన వెంటనే సమాచారం అందుకున్న వారిలో మోహన్ బాబు, రజనీకాంత్ ఉన్నారంటారు.
ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబుతో మాత్రం రజనీకాంత్ కు అడపాదడపా సాన్నిహిత్యం బయటపడుతూ వచ్చింది. గతంలో తన సినిమా *శివాజీ* ప్రీమియర్ షోలను తెలుగునాట వేసి వాటికి పలువురిని ఆహ్వానించారు రజనీకాంత్. అలాంటి ఆహ్వానితుల్లో చంద్రబాబు ఒకరు. అప్పట్లో ఏపీలో కాంగ్రెస్ సర్కారు ఉండేది. మరి రాజకీయ ప్రముఖులను సినిమా ప్రీమియర్ షోలకు ఆహ్వానించి, కేవలం చంద్రబాబును ఆహ్వానించడంపై మీడియా డైరెక్టుగా రజనీకాంత్ ను అడిగింది.
సినిమానే కదా.. మరి కాంగ్రెస్ వాళ్లను కానీ, సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని కానీ ఎందుకు ప్రీమియర్స్ కు ఆహ్వానించలేదు.. అని మీడియా అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ కాస్త నీళ్లు నమిలారు. 'త్వరలోనే వాళ్లను కూడా ఆహ్వానించి ప్రత్యేక షో వేస్తాం..' అంటూ చెప్పేసి రజనీకాంత్ కామ్ అయ్యారు.
అలాగే శివాజీ సినిమాలో విలన్ వెనుక సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఫొటోలను చూపించారనే వివాదం కూడా అప్పట్లో రేగింది. సుమన్ ఆఫీస్ సన్నివేశాల్లో.. అతడి వెనుక వారి ఫొటోలు పెట్టి, అతడిని కాంగ్రెస్ వాడన్నట్టుగా చూపించే పాట్లేవో పడ్డారు.
మొత్తానికి చాలా కాలం తర్వాత తెలుగు రాజకీయ వార్తల్లో రజనీకాంత్ పేరు వినిపిస్తోంది. తమిళ రాజకీయాల్లో ఈ స్టారు ఊసు లేదిప్పుడు. ఫ్యాన్స్ కూడా ఆశలు వదిలేసుకున్నారు, చంద్రబాబేమో రజనీకాంత్ ను వాడుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టున్నారు. ఇలాంటి జిమ్మిక్కులు కొత్తవేమీ కాదుగా!