ఇల్లు అద్దెకు ఇవ్వబడను (మేథావులకు మాత్రమే)

టు లెట్ అనే బోర్డులు పట్టణాలు, నగరాల్లో కామన్. అయితే వాటి పక్కన ఫ్యామిలీస్ ఓన్లీ, వెజిటేరియన్స్ ఓన్లీ.. అనే కండిషన్లు పెడుతుంటారు యజమానులు. కులగోత్రాలు అడిగి మరీ ఇల్లు అద్దెకిచ్చే వాళ్లు కూడా…

టు లెట్ అనే బోర్డులు పట్టణాలు, నగరాల్లో కామన్. అయితే వాటి పక్కన ఫ్యామిలీస్ ఓన్లీ, వెజిటేరియన్స్ ఓన్లీ.. అనే కండిషన్లు పెడుతుంటారు యజమానులు. కులగోత్రాలు అడిగి మరీ ఇల్లు అద్దెకిచ్చే వాళ్లు కూడా ఉన్నారు. బెంగళూరులో ఓ ఇంటి యజమాని ఇంటర్ మార్కులు అడిగి ఇల్లు అద్దెకిస్తున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును.. ఇంటర్ లో వచ్చిన మార్కులు నచ్చక, ఒక వ్యక్తికి ఇల్లు అద్దెకివ్వడానికి నిరాకరించాడు యజమాని.

శుభ్ అనే వ్యక్తి ట్వీట్ తో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కజిన్ కి ఇంటర్లో వచ్చిన మార్కుల వల్ల ఇల్లు అద్దెకు దొరకలేదని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు శుభ్. ఇంటర్లో అతడికి 76 శాతం మార్కులొచ్చాయట, కానీ డిస్టింక్షన్లో ఇంటర్ పాసయినవారికే తాను ఇల్లు అద్దెకిస్తానన్నాడట యజమాని. 90శాతం మార్కులు వచ్చిన వారికే ఇల్లు అద్దెకిస్తానని చెప్పి, తన కజిన్ ని బయటకు పంపించేశాడంటూ ట్వీట్ చేశాడు శుభ్.

బెంగళూరులో మహా కష్టం..

మామూలుగానే బెంగళూరులో ఇల్లు అద్దెకు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా 10 నెలల అద్దె అడ్వాన్స్ గా కట్టాలి. బెంగళూరులో ఇంటి అద్దె కట్టడం కంటే, నగరానికి దూరంగా ఓ సొంత ఇల్లు కొనుక్కుని ఈఎంఐ కట్టుకోవడం మేలు అని అంటారు. అద్దెలు ఎక్కువగా ఉన్నా.. నగరంలో ఉండటానికే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే అక్కడ అద్దెలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆమధ్య కరోనా టైమ్ లో ఉద్యోగులంతా సొంత ఊళ్లకు వెళ్లిపోయే సరికి సగం బెంగళూరు ఖాళీ అయింది. ఇప్పుడు కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ని తీసేయడంతో మళ్లీ అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది.

గిరాకీ పెరిగినా మరీ ఇలా ఇంటర్ మార్కులు తక్కువ అనే నెపంతో ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడం సరికాదంటున్నారు నెటిజన్లు. మరీ 90శాతం మార్కులు వచ్చినవారికే ఇల్లు అద్దెకిస్తాననడం దారుణం అంటున్నారు. మాలాంటి వారికి ఇక అద్దె ఇల్లు దొరకడం కష్టం అంటూ నిట్టూరుస్తున్నారు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. శుభ్ వేసిన ట్వీట్ కి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 

మొన్నటికిమొన్న కంపెనీ పేరు అడిగి ఇల్లు ఇచ్చేవారు. ఉద్యోగ భద్రత ఉందా లేదా అని చూసేవారు. ఇప్పుడు ఏకంగా ఇంటర్మీడియట్ లో మార్కులు చూసి ఇల్లు అద్దెకు ఇస్తున్నారు.