జాతీయ ప‌తాకాన్ని కూడా మార్చేస్తాంః బీజేపీ నేత‌!

ముస్లిం యువ‌తుల హిజాబ్ ధార‌ణ‌పై నిషేధాజ్ఞ‌లు తీసుకు వ‌చ్చిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలోని నేత‌లు మ‌రింత అత్యుత్సాహాన్ని చూపుతూ ఉన్నారు. ఆ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప ప్ర‌క‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. రానున్న కాలంలో…

ముస్లిం యువ‌తుల హిజాబ్ ధార‌ణ‌పై నిషేధాజ్ఞ‌లు తీసుకు వ‌చ్చిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలోని నేత‌లు మ‌రింత అత్యుత్సాహాన్ని చూపుతూ ఉన్నారు. ఆ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప ప్ర‌క‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. రానున్న కాలంలో దేశ జాతీయ ప‌తాకం కూడా కాషాయ ప‌తాక‌మే అవుతుంద‌ని ఈశ్వ‌రప్ప వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఉన్న త్రివ‌ర్ణ ప‌తాకం స్థానంలో కాషాయ ప‌తాకం ఎగురుతుంద‌ని ఈ క‌ర్ణాట‌క మంత్రి వ్యాఖ్యానించారు. దానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌న్నారు.

త‌న వ్యాఖ్య‌ల‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని ఇది వ‌ర‌కూ రామ‌మందిర నిర్మాణాన్ని కొంద‌రు హాస్యాస్ప‌దంగా తీసుకున్నార‌ని, తాము చేసి చూపించిన‌ట్టుగా, అలాగే జాతీయ ప‌తాకం గా కూడా కాషాయ జెండా ఎగ‌ర‌డం కూడా జ‌రుగుతుంద‌ని ఈ బీజేపీ నేత స్ప‌ష్టం చేశారు. ఎర్ర‌కోట‌పై కాషాయ ప‌తాక ఎగురుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

ఈయ‌న ప్ర‌క‌ట‌నలోని లోతు చాలానే ఉంది. కేవ‌లం ముస్లింలూ, ఇత‌ర మైనారిటీలకు సంబంధించిన వ్య‌వ‌హారాలే కాదు. అన్నీ మార‌బోతున్నాయ‌ని, అన్నీ హిందుత్వ వాదం మేర‌కే జ‌ర‌గ‌బోతున్నాయ‌ని ఈశ్వ‌ర‌ప్ప ప్ర‌క‌ట‌న సారాంశం  అనుకోవాలి. 

హిందువులు ఆచ‌రించే విధానాలు కూడా హిందుత్వ మేర‌కే మార‌తాయ‌ని బీజేపీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌ల్లో లీల‌గా వినిపిస్తున్న అంశం. హిందూ ఆచారాల్లో కూడా వ‌దిలించుకుని వ‌చ్చిన‌వి, సంస్క‌ర‌ణ‌ల‌కు గురైన వాటిని కూడా మ‌ళ్లీ తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు ఇక తీవ్రం అయినా ఏ మాత్రం ఆశ్చ‌ర్యం లేదేమో!