విశాఖలో బుధవారం సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేసి ప్రజలు, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించడం విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను సీఎం ఆదేశించారు.
విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలకు జగన్ బుధవారం వెళ్లారు. ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయానికి జగన్ చేరుకోవాల్సి ఉంది. అయితే ఆలస్యంగా 11.45 గంటలకు చేరుకున్నారు. మధ్యాహ్నం తిరిగి ఒంటిగంటకు విజయవాడకు బయల్దేరాల్సి వుండింది. కానీ ఆయన అక్కడే సాయంత్రం 4 గంటల వరకూ ఉన్నారు. ఇంత ఆలస్యం అవుతుందని పోలీస్ అధికారులు ఊహించలేదు. ట్రాఫిక్ ఆంక్షలను మాత్రం కొనసాగించారు. దీని వల్ల పౌర సమాజానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలీసులు ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. ఎన్ఏడీ కూడలి నుంచి పెందుర్తి, కంచరపాళెం, గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆస్పత్రులు, విమానాశ్రయానికి వెళ్లాల్సిన ప్రయాణికుల బాధ వర్ణనాతీతం. ఒకవైపు విమానాలకు సమయం ముంచుకొస్తున్నా పోలీసులు వాహనాలను అనుమతించకపోవడంతో ప్రయాణికులు గొడవకు దిగినా ప్రయోజనం లేకపోయింది. లగేజీలతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయానికి పరుగులు తీశారు.
తన పర్యటన ప్రజలకు ఇబ్బందులు తీసుకొచ్చిందనే విషయాన్ని ఆలస్యంగా సీఎం జగన్ గుర్తించారు. తనకు చెడ్డ పేరు తెచ్చేలా ట్రాఫిక్ ఆంక్షలు విధించిన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు.