చిత్రపరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఇవాళ కీలక దినం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ భేటీ కానున్నారు. ఈ భేటీ పరిణామాలపై టాలీవుడ్‌తో పాటు పౌర సమాజం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి తదితరులు పలు సందర్భాల్లో చర్చించారు. అయినప్పటికీ చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కారం కాలేదు.
సినీ పెద్దల కోరిక మేరకు సినిమా టికెట్ల ధరలను ఆన్‌లైన్‌లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సినిమా టికెట్ల ధరలను అమాంతం తగ్గించడంతో టాలీవుడ్ గగ్గోలు పెడుతోంది. మరోవైపు తెలంగాణలో టికెట్ల ధరలను పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎంతో చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్‌రెడ్డి విజవయాడ వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెళ్లకపోవడంపై ఆయన్నే నేరుగా మీడియా ప్రశ్నించింది. అల్లు అరవింద్ స్పందిస్తూ తమ కుటుంబం తరపున చిరంజీవి వెళుతున్నారని స్పష్టం చేశారు. అందువల్లే తాను వెళ్లడం లేదన్నారు. మెగా, అల్లు కుటుంబాలు వేర్వేరు కాదని ఆయన చెప్పకనే చెప్పారు.
ఇవాళ్టితో సినీ పరిశ్రమ సమస్యలకు ఎండ్ కార్డ్ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌తో చిత్ర పరిశ్రమ పెద్దల భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఆయన అన్నారు. అల్లు అరవింద్ ఆశాభావం నిజం కావాలని కోరుకుందాం.