బాబు, లోకేశ్‌ల‌కు జూ.ఎన్టీఆర్ షాక్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్‌ల‌కు యంగ్ హీరో, నంద‌మూరి వార‌సుడు జూనియ‌ర్ తీవ్ర నిరాశ మిగిల్చారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ అడ్డు ఎలా తొల‌గించుకోవాల‌ని కొంత కాలంగా తండ్రీత‌న‌యుడు తీవ్రంగా ఆలోచిస్తున్నార‌నే ప్ర‌చారం…

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్‌ల‌కు యంగ్ హీరో, నంద‌మూరి వార‌సుడు జూనియ‌ర్ తీవ్ర నిరాశ మిగిల్చారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ అడ్డు ఎలా తొల‌గించుకోవాల‌ని కొంత కాలంగా తండ్రీత‌న‌యుడు తీవ్రంగా ఆలోచిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతున్న నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. టీడీపీకి జూనియ‌ర్ ఎన్టీఆరే దిక్కు అనే బ‌ల‌మైన ప్ర‌చారాన్ని చంద్ర‌బాబు, లోకేశ్ జీర్ణించుకోలేకున్నారు.

చంద్ర‌బాబు కొంత కాలం క్రితం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు పార్టీలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాలంటే కార్య‌క‌ర్త‌ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఈ ప‌రిణామం చంద్ర‌బాబును షాక్‌కు గురి చేసింది. పార్టీని కాపాడుకోవాలంటే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించాల‌ని సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, ఇత‌ర ద్వితీయ శ్రేణి నాయ‌కులు బ‌హిరంగంగా డిమాండ్ చేయ‌డం చూశాం.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకోవ‌డం అంటే త‌న కుమారుడు లోకేశ్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు స‌మాధి క‌ట్ట‌డ‌మే అని చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారు. ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్ కంటే ఎన్టీఆర్ పేరే చంద్ర‌బాబుకు నిద్ర‌లేని రాత్రుల‌ను మిగిల్చుతోంది. ఇటీవ‌ల త‌న భార్య భువ‌నేశ్వ‌రిపై వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు దూషించార‌ని చంద్ర‌బాబు వెక్కివెక్కి ఏడ్వ‌డం, దానిపై ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులంతా మీడియా ముందుకొచ్చి అధికార పార్టీని హెచ్చ‌రించ‌డం తెలిసిందే. ఈ సంద‌ర్భంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో విడుద‌ల చేశారు.

మేన‌త్త‌ను అస‌భ్యంగా దూషించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఇత‌ర అధికార పార్టీ నేత‌ల‌ను ఘాటుగా హెచ్చ‌రించ‌కుండా, న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ల‌తో స‌రిపెట్టారంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌లు వ‌ర్ల రామ‌య్య‌, బుద్ధా వెంక‌న్న‌, బొండా ఉమా త‌దిత‌రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ నేత‌ల వైఖ‌రిని బ‌ట్టి జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పార్టీతో సంబంధం లేద‌నే ప‌రిస్థితి సృష్టించేందుకు బాబు, లోకేశ్ స్కెచ్ వేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టీడీపీకి శాశ్వ‌తంగా దూరం చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని రెండు రోజులుగా చంద్ర‌బాబు, లోకేశ్‌తో పాటు వారి అనుచ‌రులు సంబ‌ర‌ప‌డుతున్నారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించేందుకు వ‌చ్చే బృందంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఉన్నార‌నే వార్త తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీని టీడీపీ రాజ‌కీయ కోణంలోనే చూస్తోంది.

ఇవాళ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో  చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు అగ్ర‌నటులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు విజ‌య‌వాడ వెళుతున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం క్యాంప్ కార్యాల‌యంలో జ‌గ‌న్‌తో భేటీ కానున్నారు. అనంత‌రం సీఎంతో క‌లిసి మ‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌నున్నారు. సీఎంతో భేటీ కోసం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మ‌హేశ్‌బాబు, ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, నిర్మాత నిరంజ‌న్‌రెడ్డి వెళ్ల‌నున్నారు. అయితే చివ‌రి నిమిషంలో హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ప్పుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సీఎంతో భేటీని టీడీపీ రాజ‌కీయం చేసి, భ‌విష్య‌త్‌లో ఆ పార్టీలోకి త‌న ప్ర‌వేశానికి పూర్తిగా తలుపులు మూసివేసేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తార‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌సిగట్టార‌ని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. అందుకే సీఎంతో భేటీకి సంబంధించి మామ‌, బావ‌కు చివ‌రి నిమిషంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

టీడీపీ నుంచి నైతికంగా గెంటివేత‌కు గ్రౌండ్ సిద్ధం చేసుకున్న ప‌రిస్థితిలో జూనియ‌ర్ ఎన్టీఆర్ భారీ ట్విస్ట్ ఇవ్వ‌డాన్ని బాబు, లోకేశ్ జీర్ణించుకోలేకున్నారు. త‌న పేరుపై విస్తృతంగా చ‌ర్చ‌కు అవ‌కాశం ఇచ్చి, దాని ఫ‌లితాలు ఎలా వుంటాయో జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యూహాత్మ‌కంగా ప‌రీక్షించారు. జ‌గ‌న్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ కాక‌పోవ‌డం టీడీపీ పెద్ద‌ల‌తో పాటు ఎల్లో మీడియాకు తీవ్ర నిరాశ మిగిల్చింద‌ని చెప్పొచ్చు.