రణబీర్ కపూర్ కు ఈడీ నోటీసులు

బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్-ఈడీ నోటీసులు జారీచేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి ఈడీ ఈ నోటీసులిచ్చింది. ఈ బెట్టింగ్ యాప్ లో సోషల్…

బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్-ఈడీ నోటీసులు జారీచేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి ఈడీ ఈ నోటీసులిచ్చింది. ఈ బెట్టింగ్ యాప్ లో సోషల్ మీడియా ఇన్-ఫ్లూయన్సర్ గా ఉన్నాడు రణబీర్ కపూర్. అంతేకాదు, ఆ యాప్ కు ఇండియాలో భారీగా ప్రచారం చేసి పెట్టాడు.

ఈ యాప్ కు సంబంధించిన సంస్థపై మనీ ల్యాండరింగ్ ఆరోపణలున్నాయి. ఈ విచారణలో భాగంగా రణబీర్ కు కూడా నోటీసులు అందాయి. 10వ తేదీన ఆఫీస్ కు రావాల్సిందిగా అందులో స్పష్టం చేశారు. సదరు యాప్ నుంచి రణబీర్ కు ఎంత డబ్బు వచ్చింది? అది ఏ రూపంలో/ఏ మార్గంలో వచ్చిందనే అంశంపై ఈ హీరో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

యూఏఈ కేంద్రంగా నడుస్తోంది ఈ బెట్టింగ్ యాప్. ఈ యాప్ కో-ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్. ఈమధ్య ఇతడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించి ముంబయి నుంచి ప్రముఖ నటీనటులు, గాయకులు, హాస్యనటులు హాజరయ్యారు. వీళ్లందరి కోసం దాదాపు 50 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని అతడు ఆఫ్-షోర్ ఎకౌంట్స్ ద్వారా చెల్లించినట్టు ఈడీ గుర్తించింది. ఇప్పటికే పలువురికి నోటీసులిచ్చింది, తాజాగా లిస్ట్ లోకి రణబీర్ చేరాడు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముంబయి, కోల్ కతా, భోపాల్ లో సోదాలు నిర్వహించింది ఈడీ. అక్రమంగా ఉన్న పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. అక్రమ ఖాతాల్ని సీజ్ చేసింది. ఈ ఫ్లాట్ ఫారమ్ ద్వారా పెద్ద ఎత్తువ హవాలా సాగినట్టు గుర్తించింది ఈడీ. ఇదే క్రమంలో సౌరభ్ పెళ్లి ఈడీని ఆకర్షించింది.

ఈ పెళ్లి కోసం ఏకంగా అతడు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు గుర్తించి, అధికారులు అవాక్కయ్యారు. ఇందులో 50 కోట్లు బాలీవుడ్ ప్రముఖులకు వివిధ మార్గాల ద్వారా చేరినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ యాప్ ను నిర్వహించే కంపెనీలకు చెందిన సుమారు 417 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ ఫ్రీజ్ చేసింది.