పోటు గాళ్లు…కాదు…’వేటు’ గాళ్లు

హీరో..హీరోయిన్..భారీ సపోర్టింగ్ నటులు, మాంచి టెక్నికల్ సపోర్ట్.. మంచి సినిమాటోగ్రాఫర్.. ఆపై బలమైన కో డైరక్టర్ ఇలా అన్ని విధాలా ప్యాక్ సంపాదించి హిట్ లు కొట్టే దర్శకులే మన దగ్గర ఎక్కువ. అందుకే…

హీరో..హీరోయిన్..భారీ సపోర్టింగ్ నటులు, మాంచి టెక్నికల్ సపోర్ట్.. మంచి సినిమాటోగ్రాఫర్.. ఆపై బలమైన కో డైరక్టర్ ఇలా అన్ని విధాలా ప్యాక్ సంపాదించి హిట్ లు కొట్టే దర్శకులే మన దగ్గర ఎక్కువ. అందుకే ఫలానా ఫొటోగ్రాఫర్ నే కావాలి అంటారు. ఈ వీక్ నేస్ చూసే వాళ్లు కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తారు. మొత్తం మీద సినిమా హిట్ అనిపించుకుంటే చాలు దర్శకుల రెమ్యూనిరేషన్ కోట్లకు పెరిగిపోతుంది. ఇక అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ మీద దృష్టి…స్వంత బ్యానర్ల మీద దృష్టి..దాంతో క్రియేటివిటీ అటక ఎక్కేస్తుంది.

వి వి వినాయక్…తన తండ్రి థియేటర్లో సినిమాలు చూసి పెరిగి, మాస్ పల్స్ పట్టుకున్నారు అని పేరు తెచ్చుకున్న దర్శకుడు. కథకుడు కాదు. కేవలం దర్శకుడు. సరైన కథలు లేవు..చతికలపడిపోయారు. మాంచి డైరక్టర్ అని సినిమా చేస్తే అఖిల్ కు ఓ డిజాస్టర్ చేతిలో పెట్టారు. సాయి ధరమ్ తేజ్ కు అంతకన్నా డిజాస్టర్ బహుమతిగా ఇచ్చారు. కథ లు లేక పూర్తిగా చతికిల పడిపోయారు.

సురేందర్ రెడ్డి..ఈయనా అంతే. కథకుడు కాదు. వక్కంతం కథలు వండి ఇస్తే సినిమాలు తీస్తారు. ఆ కథ సెట్ అయితే కింగ్..లేదంటే అంతే.70 నుంచి 80 కోట్లు నిర్మాత చేత ఖర్చు చేయించేసి, దారుణాతి దారుణమైన సినిమాను తీసి చేతిలో పెట్టారు. అఖిల్ అహర్నిశం కష్టపడితే నిరాశలో ముంచారు.

వీళ్లిద్దరే కాదు చదవేస్తే ఉన్న మతి పోయిందనే విధంగానే తయారవుతున్నారు పైకి ఎదిగిన దర్శకులు. సాంకేతిక నిపుణులు సహకారం మీద డిపెండ్ అయిపోయి, కాంబినేషన్లు ఖర్చు మీద ఆశలు పెట్టేసుకుని, కథ మీద కసరత్తు మానేస్తున్నారు. దాంతో సినిమాలు దూది పింజల్లా తేలిపోతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ కూ ఇదే విమర్శ వుంది. పాత సినిమాలు అటు ఇటు కలిపి తిరిగి తీస్తారని. కథ మీద కసరత్తు తగ్గించేసారని.

విక్రమ్ కే కుమార్, పూరి జగన్నాధ్, ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి అవసరాల వరకు సినిమాలు ఫెయిల్యూర్ లు అన్నీ స్క్రిప్ట్ ఫెయిల్యూర్ లే. అంతకు ముందు శ్రీను వైట్ల కూడా ఇదే తీరు. త్రివిక్రమ్ అజ్ఙాత వాసి పరిస్థితి ఇదే కదా. కొరటాల శివ సంగతి చెప్పనక్కరలేదు. సినిమా బిజినెస్ లో వేళ్లు పెట్టి ఆర్థికంగా, మానసికంగా దెబ్బలు తిన్నారు.

క్రియేటర్ అన్న వాళ్లు తమ క్రాఫ్ట్ మీద దృష్టి పెట్టాలి. సినిమా నిర్మాణాల్లో దూరి, లెక్కలు కట్టుకుంటూ కూర్చోవడం కాదు. లేదా వాళ్లకీ వీళ్లకీ ముడిపెట్టి, సినిమాలు సెట్ చేసి డబ్బులు చేసుకునే పనిలో పడడం కాదు. తమ క్రాఫ్ట్ మరిచిపోతే, తమ క్రాఫ్ట్ ను అప్ డేట్ చేసుకోకపోతే, తమ క్రాఫ్ట్ లో తమ సత్తా చూపకపోతే కనుమరుగు అయిపోవడం ఖాయం. 

డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ లో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అదంతా ఓకె. కానీ వీటన్నింటికీ మూలమైన తమ వృత్తి నుంచి మాత్రం కనుమరుగైపోతారు.