హైకోర్టులో ర‌ఘురామ‌కు విచిత్ర ప‌రిస్థితి

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు హైకోర్టులో విచిత్ర ప‌రిస్థితి ఎదురైంది. ఏపీకి సంబంధించి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌పై ఆయ‌న న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించం అల‌వాటుగా మారింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కూడా ఆయ‌న…

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు హైకోర్టులో విచిత్ర ప‌రిస్థితి ఎదురైంది. ఏపీకి సంబంధించి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌పై ఆయ‌న న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించం అల‌వాటుగా మారింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కూడా ఆయ‌న న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించి భంగ‌పాటుకు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో చింతామ‌ణి నాట‌క నిషేధంపై ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించి కొన్ని ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

చింతామ‌ణి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌పై నిషేధం విధిస్తూ జ‌న‌వ‌రి 17న రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పిల్ వేశారు. ఎంపీ ర‌ఘురామ త‌ర‌పున న్యాయ‌వాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాద‌న‌లు వినిపించారు.  దీనిపై హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్ మిశ్రా, జ‌స్టిస్ ఎం.స‌త్య‌నారాయ‌ణ‌మూర్తితో కూడిన ధ‌ర్మా సనం బుధ‌వారం విచారించింది.  

పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ … వందేళ్ల‌కు పైగా చింతామ‌ణి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతోంద‌న్నారు. నాట‌కంలోని ఓ పాత్ర‌పై అభ్యంత‌రంతో మొత్తం నాట‌కాన్ని నిషేధించ‌కూడ‌ద‌న్నారు. విన‌తుల ప్రాతిప‌దిక‌న నిషేధిస్తూ పోతే… మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయ‌నే కార‌ణంతో ప్ర‌తి ఒక్క‌రూ అదే బాట ప‌డ‌తార‌ని అభ్యంత‌రం చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం జోక్యం చేసుకుంటూ పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాదికి  ప్ర‌శ్నలు వేసింది. చింతామ‌ణి నాట‌క నిషేధం విష‌యంలో మీ ఆస‌క్తి ఏంటి? మీరు ఎవ‌ర‌ని ధ‌ర్మాస‌నం సూటిగా ప్ర‌శ్నించింది. అస‌లు ఈ పిటిష‌న్ వేయ‌డం వెనుక మీ ప్ర‌యోజనాలు ఏమున్నాయ‌ని ధ‌ర్మాస‌నం నిల‌దీయడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది స్పందిస్తూ … పిటిష‌న‌ర్ ఒక ఎంపీ అని చెప్పారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం కార‌ణంగా వేల మంది క‌ళాకారుల జీవ‌నోపాధి దెబ్బ‌తింటోంద‌న్నారు. ధ‌ర్మాస‌నం స్పందిస్తూ ఓ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కించ‌ప‌రుస్తూ జీవ‌నోపాధి పొంద‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి వాటిపై తాము త‌ప్ప‌కుండా న్యాయ‌స‌మీక్ష చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా వుండ‌గా పిటిష‌న‌ర్ నేప‌థ్యం, పిల్ వెనుక ఉద్దేశాన్ని హైకోర్టు ఆరా తీయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.