విభజన రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. పార్లమెంటు వేదికగానే ప్రకటించారు. అయితే ఈ ప్రకటన మీద తెలంగాణ రాష్ట్ర అగ్గిగుండంగా మారిపోయింది. ప్రధాని పట్ల నిరసనలు, నిందలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో.. ఏపీలో ఎలాంటి చప్పుడు కూడా లేదు! అవును అన్యాయం జరిగింది నిజమే అనిగానీ.. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి మీరేం చేస్తున్నారు సార్ అనిగానీ ఎవ్వరూ నోరెత్తిన పాపాన పోలేదు. కానీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు.
ఏపీకి అన్యాయం జరిగిందని సాక్షాత్తూ ప్రధాని పార్లమెంటులోనే ప్రకటించిన తర్వాత.. ఆ ప్రకటన ఆధారంగా ఆ అన్యాయంపై చర్చ జరగాలని, ఏపీ ఎంపీలు చర్చను డిమాండ్ చేస్తూ నోటీసు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అడగకుండా మౌనంగా ఉంటే.. ముందు తరాలు నష్టపోతాయని, ఏపీకి ఎలాంటి అన్యాయం చేసినా అడిగే దిక్కుండదని అందరూ అలాంటి ద్రోహాలు చేస్తారని ఉండవిల్లి అంటున్నారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కోర్టుకీ వెళ్లరు.. పార్లమెంటులోనూ అడగరు.. ఇంత దమ్ములేని స్థితికి మనం వచ్చేశామా? సభలో నోటీసు ఇవ్వడానికి కూడా దమ్ముల్లేవా అని ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆగ్రహమూ వాదనా అంతా కరక్టే. కానీ ఆయన డైరెక్టుగా వైసీపీ ఎంపీలనే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పెద్దసంఖ్యలో ఎంపీలు ఉన్నారు గనుక.. వైసీపీ మీద బాధ్యత ఉందన్న మాట నిజమే. కానీ.. రాష్ట్రప్రయోజనాల మీద నిజమైన శ్రద్ధ ఉంటే గనుక.. ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరగాలని నోటీసు ఇవ్వడానికి సంఖ్యాబలం అవసరం లేదు. చిత్తశుద్ధి ఉంటే చాలు.
తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎంపీలు కూడా చాలు. వారు తమ చిత్తశుద్ధి పోరాటపటిమ చాటదలచుకుంటే ఈ చర్చను సభలో లేవనెత్తాలి. ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీ మీద ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ప్రత్యేకహోదా అనే డిమాండ్ పూర్తిగా మంటగలిసిపోవడానికి బాధ్యత టీడీపీదే. ఇప్పుడు చర్చ ద్వారా కూడా సాధించేదేమీ లేదు. ఉండవల్లి చెప్పినట్టు.. ఏపీకి అన్యాయం జరిగిందనే సంగతి పార్లమెంటు సాక్షిగా దేశానికంతా తెలుస్తుంది. కనీసం మన మీద సానుభూతి అయినా వస్తుంది. అయితే టీడీపీ ఈ చర్చను లేవనెత్తితే.. అయిదేళ్లలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోడానికి చిన్న ప్రయత్నం అవుతుంది.
ఉండవల్లి చెప్పినట్టుగా ఏపీకి జరిగిన అన్యాయం గురించి మాత్రమే.. కాదు. మోడీ సర్కారు వచ్చిన తర్వాత.. ఏం న్యాయం చేసింది. అప్పటి అన్యాయాన్ని ఏ రకంగా చక్కదిద్దింది అనే అంశాల మీద కూడా చర్చ జరిగితే.. నిజంగా రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం కూడా ఉంది.