మీరు ఎన్నడైనా చూడండి.. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం వెలుపల దర్శనానంతరం రాజకీయ ప్రముఖులు మీడియాతో మాట్లాడతారు. ఏ నాయకుడిని పలకరించినా- రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, దేశ- రాష్ట్రప్రజల సంక్షేమం కోసం వచ్చి దేవుడికి మొక్కుకున్నానని అంటారు. ఇలాంటివి చూసిన ప్రతిసారీ కామెడీ అనిపిస్తుంది. వాళ్లేదో సంపదలు, కాంట్రాక్టులు, పదవులు, హోదాలు, తిరిగి నెగ్గడం, లేదా, తిరిగి అధికారంలోకి రావడం లాంటి సంకుచితమైన స్వార్థ ప్రయోజనాలతో కోరికలతో దేవుడి దగ్గరకువ వస్తారు.
మాకు ఇవన్నీ ఇవ్వు దేవుడా నీకు ఇంత వాటా ఇస్తాం అంటూ కానుకలు చెల్లించడం గురించి మొక్కుకుంటారు. మీడియా కనిపించగానే.. రాష్ట్ర ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి తప్ప తాము దేవుడి దర్శనానికి రావడం వెనుక మరో ప్రయోజనం లేదని సెలవిస్తారు. ఈ వైఖరి ఒక మహా ఆత్మవంచన! రాజకీయ నాయకుల యొక్క అలాంటి ఆత్మవంచన పూర్వకమైన సంకుచిత వైఖరిని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతున్న ట్రెండ్ సెట్టర్ గా ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ అవతారం ఎత్తుతున్నారు. ఆయన అనుష్టుప్ నారసింహ దర్శన యాత్ర చేస్తారట.
మామూలుగానే రాజకీయ నాయకుల్లో 99శాతం మంది ప్రజల ఎదుటకు వస్తే.. ప్రతిదీ ఆత్మవంచనతో కూడుకున్న మాటలే మాట్లాడుతుంటారు. తమ జీవితమే ప్రజలకు అంకితం అంటారు. తమకు ప్రజల సంక్షేమం తప్ప.. పడుకున్న లేచినా కాలకృత్యాలు తీర్చుకుంటున్నా వేరే ఆలోచనే ఉండడం లేదని సెలవిస్తారు. ఇలాంటి మభ్యపెట్టే మాయ మాటలకు ప్రజలు కూడా అలవాటు పడిపోయారు.
తిరుమల దేవుడి దర్శనం తర్వాత వెలుపలికి వచ్చి.. ‘త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది. నాకు మంత్రి పదవి రావాలని కోరుకున్నా’, ‘ఈసారి నాకు ఎమ్మెల్యే టికెట్ డౌటు అంటున్నారు. మా నాయకుడు తప్పకుండా టికెట్ ఇచ్చేలా చూడమని కోరుకున్నా’ అని మీడియా ముందు నిజాయితీగా ప్రకటించిన నాయకుడిని మన జీవితంలో ఎన్నడైనా గమనించామా? అసాధ్యం. వారి ప్రతిమాటా ఆత్మవంచనతోనే కూడుకుని ఉంటుంది. ప్రజల కోసమే తాము దేవుడికి మొక్కుతుంటాం అని చెబుతుంటారు. ప్రజలు నమ్ముతారని వారు అనుకుంటారో లేదో.. డైలాగులు మాత్రం అలాగే వల్లిస్తారు.
పవన్ కల్యాణ్ ఒక సినీ నటుడిగా, రాజకీయ నేపథ్యం లేని బయటి వ్యక్తిగా, స్వచ్ఛత గురించి నిజాయితీ గల రాజకీయాల గురించి, ఆవేశపూరితంగా మాట్లాడే, యువతకు ఏదో చెప్పాలని ప్రయత్నించే నాయకుడిగా ఆయనకు ఒక గుర్తింపు ఉండేది. ఆయన ఫ్యాన్స్ వెర్రి ఆరాధానతో ఆయన ఏం చెప్పనా విజిల్స్ వేస్తుంటారు గానీ.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కొంచెం కొత్త తరహాను చూపించగలరేమో అనే ఒక చిన్న ఆశ తటస్థుల్లో కూడా ఉండేది. కానీ.. కాలక్రమంలో ఆయన ప్రవర్తన రాజకీయ వైఖరులు వేస్తున్న అడుగులు ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కాకుండా ఇతర వ్యక్తుల్లో పవన్ మీద ఉన్న ఆశలను సన్నగిల్ల జేశాయి.
రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకోసం తాను పనిచేయాలి. తాను ఏం పని చేయగలడో ఆలోచించాలి. చేయగలిగినదే ప్రజలకు చెప్పాలి. వారికోసం కష్టపడాలి. అలా కాకుండా.. ప్రజల సంక్షేమాన్ని, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే కోరికను దేవుడి కోర్టులో పారేసేవాడు రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? ప్రజలు- తమ సంక్షేమం కోసం నాయకుడు పనిచేస్తాడని నమ్ముతారు. కానీ వాడు కాస్తా దేవుడి దగ్గరకు వెళ్లి ఆయన మీద భారం వేసేట్లయితే.. ఇక ప్రజలు నాయకుడిని గౌరవించడం ఎందుకు? మేం అభివృద్ధి చెందాలి స్వామీ అని ఎవరికి వారు దేవుడికే మొక్కుకుంటే సరిపోతుంది కదా.
పవన్ కల్యాణ్ అంటే.. దేవుడికి- అభివృద్ధి చెందకుండా కునారిల్లిపోతున్న పేద ప్రజలకు మధ్య అంబికా దర్బార్ బత్తి కాదు కదా! ఆంజనేయ స్వామి తమ ఇష్టదైవం అని మెగా ఫ్యామిలీ చెప్పుకుంటారు. తెలంగాణలోని ప్రఖ్యాత ఆంజనేయస్వామి ఆలయం కొండగట్టును పవన్ సందర్శిస్తారట. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి, నాంపల్లి నరసింహక్షేత్రాలను సందర్శిస్తారట. ఆ తర్వాత దశలవారీగా మరో 30 క్షేత్రాలను కూడా సందర్శిస్తారట. ప్రతిచోటా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించే దేవుడికి మొక్కబోతున్నారన్నమాట.
పవన్ గారూ.. మీరు సొంతంగా ఏ తెలుగు రాష్ట్రంలో అయినా అధికారంలోకి రావడం అనేది ఈ జన్మలో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు మీరు ప్రాక్టికల్ గా ఆలోచించలేకపోతున్నారు. మీకేదో మంచి జరుగుతుందని నరసింహ క్షేత్రాలన్నీ తిరగదలచుకుంటే తిరగండి. కానీ.. దాన్ని ప్రజలకోసం అని చెబుతూ ఎందుకు ఆత్మవంచన చేసుకుంటారు? ఆ మాటలు ప్రజలు నమ్ముతున్నారనే భ్రమలు మీకు ఏమైనా ఉన్నాయా? ప్రజలు మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారనే సమాచారం మీకు ఎవ్వరూ చెప్పడం లేదా? మీ చుట్టూ చేరే వందిమాగధులంతా.. మీ అనుష్టుప్ నారసింహ దర్శన యాత్ర పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయనే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారా?
పవన్ గారూ.. మీరు నిజాయితీగల రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు! తద్వారా మీరు ఒక ఆదర్శ రాజకీయ వ్యవస్థను స్వప్నిస్తున్న అభిప్రాయాన్ని కలిగిస్తుంటారు. రాజకీయాలు సర్వభ్రష్టత్వం చెందాయి. వాటిని వదిలేయాలని కాదు.. అక్కడ నిజాయితీని పాదుగొల్పడం చాలా సుదీర్ఘమైన ప్రయత్నం. కానీ.. మీరు వ్యక్తిగా నిజాయితీపరులే అనే మా నమ్మకం. కానీ, ఇలాంటి దేవుడి యాత్రలు చేసుకునేప్పుడు.. వాటిని ప్రజలకోసం అని ముడిపెట్టకుండా.. చప్పుడు కాకుండా గుడికి వెళ్లి రండి.
మీరు ఆయా జిల్లాల్లో పార్టీ సమావేశాలు పెట్టి, ఆ సందర్భంగా గుడికి వెళ్లి దర్శించుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ, గుడికి వెళ్లడమే ప్రధాన కార్యక్రమం అయి.. ఆ సందర్భంగా పార్టీ సమావేశాలు పెట్టుకుంటే.. మిమ్మల్ని సీరియస్ రాజకీయ నాయకుడని నమ్మడం ఎలాగ? రాజకీయాల్లో నిజాయితీ సంగతి తరువాత.. వ్యక్తిగా నిజాయితీగా మాట్లాడడం మీరు నేర్చుకుంటే మంచిది.