చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్. ఈ కామెంట్ చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ తొలిసారి సీఎం జగన్ నోటి వెంట దత్తపుత్రుడు అనే మాట రావడంతో పవన్ బాగా హర్ట్ అయ్యారు. తనకు తానే ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో దత్తపుత్రుడు అనే కామెంట్ కి కూడా సమాధానం ఇచ్చారు.
డూడూ బసవన్నలా వైసీపీకి తలూపకపోతే అందర్నీ కామెంట్ చేస్తారని, సుప్రీంకోర్టు జడ్జిలను సైతం టార్గెట్ చేస్తారని విమర్శించారు. మమ్మల్ని వెటకారం చేస్తే ప్రయోజనం ఏంటి. వెటకారాలు ఆపి పని చూడండి, పనికొచ్చే మాటలు చెప్పండి.. అంటూ కాస్త అసహనంగా సమాధానమిచ్చారు పవన్. తాను ప్రజలకు తప్ప ఇంకెవరికీ దత్తపుత్రుడిని కాదని చెప్పారు.
దత్తపుత్రుడు అనే ముద్ర చెరిగిపోదా..?
పవన్ కల్యాణ్ ఎప్పటికైనా చంద్రబాబు మనిషే. బయటకి కోపం చూపించినా, లోలోపల మాత్రం ఆయన బాబుకే సపోర్ట్ చేస్తారు. టీడీపీ, జనసేన వ్యవహారాలు తెలిసినవారెవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. చంద్రబాబుని ఏనాడూ పల్లెత్తుమాట అనని పవన్, అప్పట్లో అధికారంలో లేని జగన్ పై తీవ్రంగా విరుచుకుపడేవారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా పవన్ తన టార్గెట్ మార్చలేదు.
అంటే వైసీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా పవన్ టార్గెట్ కేవలం జగన్ మాత్రమే. అదే సమయంలో చంద్రబాబు కూడా అంతే స్థాయిలో పవన్ పై వాత్సల్యం చూపిస్తుంటారు. పవన్ ఒప్పుకున్నా లేకపోయినా.. వన్ సైడ్ లవ్ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. మరి అంతగా ప్రేమించే చంద్రబాబుని పవన్ సైతం ఎందుకు వదిలిపెడతారు చెప్పండి..?
మేం తండ్రికొడుకులం.. మధ్యలో మీకెందుకు..?
దత్తపుత్రుడు అనే మాటకి పవన్ బాగా హర్టయ్యారనే విషయం మాత్రం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. తానెవరికీ దత్తపుత్రుడ్ని కాదని, కేవలం ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడ్ని అని చెప్పుకుంటున్నారు పవన్. టీచర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలా తమని ఆడిపోసుకుంటున్నారని అన్నారాయన. తమలో తాము ఎలాగైనా ఉంటామని, మధ్యలో మీకెందుకు అన్నట్టుగా మాట్లాడారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ కవర్ చేసుకున్నారు కానీ, చంద్రబాబు మాత్రం దీనిపై స్పందించకపోవడం విశేషం. ఆయన పరిస్థితి మరీ కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది. పవన్ తనకి దత్త పుత్రుడు కాదు అని చెప్పలేడు, అవును అని ఒప్పుకోనూ లేడు. ప్రస్తుతానికి దత్త తండ్రి సమాధానం లేనట్టే.. దత్త పుత్రుడే ఇప్పుడు బయటపడ్డాడు.