కమలం వలవిసిరినా.. గులాబీ వైపే మొగ్గు!

ఆయన కాంగ్రెసు పార్టీ మీద అసంతృప్తితో రగిలిపోయారు.. ఎమ్మెల్యే టికెట్ తనకు తప్పకుండా దక్కుతుందనే నమ్మకంతో కొన్నేళ్లుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తూ పనిచేస్తే.. చివరి నిమిషంలో ఇతర పార్టీనుంచి వలసవచ్చిన నాయకుడికి…

ఆయన కాంగ్రెసు పార్టీ మీద అసంతృప్తితో రగిలిపోయారు.. ఎమ్మెల్యే టికెట్ తనకు తప్పకుండా దక్కుతుందనే నమ్మకంతో కొన్నేళ్లుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తూ పనిచేస్తే.. చివరి నిమిషంలో ఇతర పార్టీనుంచి వలసవచ్చిన నాయకుడికి టికెట్ ఇవ్వడానికి పూనుకోవడం ఆయనకు మనస్తాపం కలిగించింది! వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. 

అయితే ఇలాంటి వారి కోసమే భారతీయ జనతా పార్టీ కాచుకుని ఉంది. తాము టికెట్ ఇస్తామని ఆఫర్ చేసింది. ఆయన చేరిక కూడా దాదాపుగా ఖరారైనట్టే రాజకీయవర్గాల్లో వినిపించింది. కానీ ఆయన చివరకు భారాసవైపు మొగ్గారు. ఆ రకంగా.. నాయకులను ఆకర్షించడంలో.. భాజపా మీద భారాస విజయం సాధించినట్లు అయింది. ఈ ఉపోద్ఘాతం అంతా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఇటీవలే రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్ గురించి! ఆయన తాజాగా కేటీఆర్ సమక్షంలో భారాస కండువా కప్పుకున్నారు.

నందికంటి శ్రీధర్ తాను ఇన్నాళ్లూ పనిచేసిన కాంగ్రెసు పార్టీనుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే భారాస మీద అలిగిన ఆ నియోజకవర్గపు సిటింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పుణ్యమాని సమీకరణాలు మొత్తం మారిపోయాయి. 

తన కుటుంబంలో తండ్రీకొడుకులు ఇద్దరికీ మల్కాజిగిరి, మెదక్ టికెట్లు కావాల్సిందే అనే పట్టు మీదున్న హన్మంతరావు.. భారాస తనకు టికెట్ ప్రకటించినా కూడా కాలదన్నుకుని ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. అయితే ఆయన బలమైన నేతగా పార్టీకి ఉపయోగపడతాడనే నమ్మకంతో.. ఒక కుటుంబంలో రెండేసి టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెసులో కొన్ని నియమనిబంధనలు ఉన్నప్పటికీ.. కాంగ్రెసు హామీ ఇచ్చింది. ఆయన రాకతో మల్కాజిగిరి టికెట్ నందికంటికి కాకుండాపోయింది.

ఆగ్రహించిన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే అప్పటికే భారాసలో కూడా మల్కాజిగిరి టికెట్ కన్ఫర్మ్ అయిపోయి ఉంది. మైనంపల్లి పార్టీని వీడిన వెంటనే.. కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఆ రకంగా గులాబీ పార్టీలో టికెట్ దక్కే అవకాశం లేదు. ఇక నందికంటి శ్రీ ధర్ అనివార్యంగా భాజపాలో చేరుతారనే ప్రచారం జరిగింది. భాజపా కూడా ఆయన కోసం వలవేసి నిరీక్షించింది. కానీ గులాబీ ఎత్తుగడలే ఫలించాయి. ఆయన భారాసలో చేరారు.

అంతేకాదు, మల్కాజిగిరి నియోజకవర్గంలో భారాస అభ్యర్థిని గెలిపిస్తాననే ప్రతిజ్ఞ ద్వారా తనకు టికెట్ పై ఆశలేదని కూడా తేల్చేశారు. ఈ పరిణామాలు భాజపాకు చేదుగానే ధ్వనిస్తుండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.