అమెరికా వద్దు- ఇండియానే ముద్దు

ఏ పనైనా ఎక్కడ చేస్తే ఎక్కువ సంపాదనొస్తుందో అక్కడికి వెళ్లాలనుకోవడం సహజం. కానీ సంపాదన ఒక్కటే జీవితం కాదనే సత్యం దిగితే గానీ తెలీదు. దూరపు కొండలు నునుపు అనే సామెత ఊరికే పుట్టలేదు.  Advertisement…

ఏ పనైనా ఎక్కడ చేస్తే ఎక్కువ సంపాదనొస్తుందో అక్కడికి వెళ్లాలనుకోవడం సహజం. కానీ సంపాదన ఒక్కటే జీవితం కాదనే సత్యం దిగితే గానీ తెలీదు. దూరపు కొండలు నునుపు అనే సామెత ఊరికే పుట్టలేదు. 

అమెరికాలోనో, ఇంగ్లాండులొనో జీవించే భారతీయులు తమకన్నా చాలా ఉన్నతంగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నారని అనుకోవడం సగటు భారతీయ యువతీయువకులకి, ఆమాటకొస్తే మధ్యవయసువాళ్లకి కూడా సర్వ సాధారణం. 

అమెరికాలో సంపాదన ఎంతొస్తోందనేది కాదు, ఎంత ఆదా చేయగలుగుతున్నారనేది మొదటి విషయం. 

ఎంత ఆదా చేయగలుతున్నారన్న దాని కంటే ఎంత ప్రశాంతంగా ఉంటున్నారనేది మరొక విషయం.

అమెరికా-ఇంగ్లాండ్ దేశాల్లో కరెన్సీ విలువ రూపాయికంటే ఎక్కువే. పైగా అక్కడ వసతులు, శుభ్రత, అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది నిన్నటి వరకు నిజం. కానీ నేడది అర్ధసత్యమే. 

ఎందుకంటే “ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్” అనబడే అమెరికాలో మునుపుటన్ని ఉద్యోగావకాశాలు లేవు. 

ఎంతమందినైనా ఎక్కించునేలాంటి పుష్పకవిమానంలాగ లేదు ఇప్పటి అమెరికా. 

అమెరికాలో చదువుకుంటే అక్కడే మంచి ఉద్యోగమొచ్చి స్థిరపడొచ్చని అనుకుని ఎన్నో ఆశలతో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని వెళ్లిన లక్షలాదిమంది తెలుగు మరియు ఇతర భారతీయ విద్యార్థులు ఉద్యోగాలు దొరక్క వెనక్కి రావాల్సిందే. 

ఒకవేళ ఎంతో మెరిట్ ఉన్న విద్యార్థి టాప్ యూనివెర్సిటీలో చేరాడనుకుందాం. కోర్స్ పూర్తి చేసి మంచి ఉద్యొగం సంపాదించాడనుకుందాం. ఇప్పుడున్న లెక్కల్లో అతనికి అమెరికాలో గ్రీన్ కార్డ్ రావాలంటే కనీసం 25 ఏళ్లు పట్టొచ్చు. కొన్ని లెక్కల ప్రకారం అంతకంటే ఎక్కువే పట్టొచ్చు. 

లేదా త్వరితగతిన గ్రీన్ కార్డ్ పొందాలంటే అతనికి ఒకటే దారి. 

అమెరికన్ సిటిజెనో, గ్రీన్ కార్డ్ హోల్డరో అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తద్వారా గ్రీన్ కార్డొస్తుంది. అక్కడి నుంచి ఐదేళ్లల్లో సిటిజిన్ షిప్ పొందొచ్చు. 

ఇక్కడ కష్టమంతా గ్రీన్ కార్డ్ పొందడంలోనే ఉంది. 

పోనీ ఏలాగో అలా గ్రీన్ కార్డ్ పొందినా, పైన చెప్పుకున్న హై మెరిట్ విద్యార్థి టాప్ కంపెనీలో మంచి వేతనం తీసుకుంటున్నట్టైతే బాగానే సేవ్ చేసుకోవచ్చు. 

అందరూ అంత మెరిట్ విద్యార్థులు, టాప్ యూనివెర్సిటీ బాపతు ఉండరు కదా. 

ఏదో యూనివెర్సిటీలో ఎమ్మెస్ చేసిన వారిలో అధికశాతం మందికి ఉద్యోగాలే రావు. వచ్చినా ఆ జీతాలతో ఏమీ సేవ్ చేయలేరు. గ్రీన్ కార్డ్ కల నెరవేరడం కష్టం. 

గ్రీన్ కార్డ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం ఈ స్థాయివాళ్లకి అంత ఈజీ కాదు. హై శ్యాలరీ అబ్బాయిల నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది వాళ్లకి. 

ఇలాంటి టెన్షన్ల మధ్య యుక్తవయసులోనే బీపీలు, షుగర్లు తెచ్చుకుంటున్నవాళ్లున్నారు. దీనికి తోడు అమెరికా మునిపటిలా లేదు. 

ప్రస్తుతం డెమాక్రటిక్ పార్టీ ఏలుతున్న రాష్ట్రాలన్నీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ తో నిండిపోతున్నాయి. 

మెక్సికో నుంచి రోజుకి 10000 మంది అక్రమంగా అమెరికాలో చొరబడి జీవిస్తున్నారని ఒక అంచనా. 

డ్రగ్స్ ని లీగలైజ్ చేయడంతో క్రైం రేట్ పెరిగింది. గన్-కల్చర్ ఉన్న ఆ దేశంలో డ్రగ్స్ తీసుకుని ఎప్పుడు ఎవడు పైశాచికంగా ఎవర్ని కాలుస్తాడో తెలియని పరిస్థితి. అంత దారుణంగా ఉంది అమెరికా ఇప్పుడు. 

ఒకప్పుడు శాన్ ఫ్రాసిస్కో భూతల స్వర్గంగా అనిపించేది. ఎంతో మందికి సెటిలవ్వడానికి అది డ్రీం డెస్టినేషన్. కానీ ఇప్పుడలా లేదు. పబ్లిక్ గా మూత్రవిసర్జనలు, డ్రగ్స్ సేవిస్తున్న జనంతో చిరాకు భయం గొలుపుతోంది. ఎలాన్ మస్క్ కూడా దీనిపై తన విచారాన్ని వ్యక్తపరిచాడు. 

రిపబ్లికన్ రాష్ట్రాలైన టెక్సాస్, ఫ్లోరిడాల్లాంటివి అభివృద్ధి చెందుతుంటే డెమాక్రటిక్ రాష్ట్రాలన్నీ గబ్బుపట్టి ఉన్నాయి. కారణం మరీ లిబరల్ గా ఉండే డెమాక్రటిక్ పార్టీ ధోరణి. 

బైడన్ హాయాములో అమెరికా చాలా విషయాల్లో వెనకపడింది. ముఖ్యంగా ప్రజాభద్రత విషయంలో!

ఇలాంటి దేశంలో బతకడానికి ఏవేవో ఆశలు పెట్టుకుని దిగుతున్నారు. వచ్చే ముందే పార్ట్ టైం జాబుల కోసం అమెరికాలో తెలుసున్న తెలుగు వాళ్లకి ఫోన్స్ చేసి అడుగుతున్నారు. 

ఫాలానా విద్యార్థికో, విద్యార్థినికో పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పించమంటూ తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి కూడా రికమెండేషన్ ఫోన్లు అందుకుంటున్న అమెరికన్ ఎన్నారైలు ఉంటున్నారు. 

ఒక దశలో తమ ఏరియాలో ఇంట్లో పాచీపనికి తప్ప మామూలు ఉద్యోగాలు దొరకట్లేదని ఒక ఎన్నారై అంటే, అదైనా ఓకే అట అని బదులిచ్చిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. 

అంత దయనీయంగా మారుతోంది అమెరికా పరిస్థితి. అంత డిస్పరేట్ గా ఉండడం తెలుగు విద్యార్థుల దుస్థితి. 

ఇన్ని కష్టాలు, ఆపసోపాలు పడి, గన్-కల్చర్ ఉన్న ఆ డ్రగ్స్ దేశంలో గొప్పగా సెటిలయ్యే గ్యారెంటీ లేకుండా ఎందుకొచ్చిన అమెరికా కలలు.. అని అనిపించట్లేదు!? 

చాలా ఏళ్ల తర్వాత ఒక ఎన్నారై అమెరికా నుంచి ఒక బట్టల షాపుకు వెళ్లి పాతిక వేల రూపాయల చీర కొని గొప్పగా ఫీలయ్యిందట. కానీ ఆమె పక్కనే ఉన్న లోకల్ మహిళ ఒకావిడ ముప్పై వేల చీర తన కూతురి కోసం కొన్నదట. ఏం చేస్తారని అడిగితే తమకి కూకట్పల్లిలో ఒక చిన్న మెడికల్ షాప్ ఉందని చెప్పిందట ఆమె. ఇండియాలో పెరిగిన పర్చేసింగ్ పవర్ చూసి కళ్లు బయర్లు కమ్మాయి ఆ ఎన్నారై మహిళకి. ఈ విషయం ఆ ఎన్నారై మహిళ ఫేస్బుక్కులో పెట్టిన పోస్ట్ సారాంశమే ఇది. 

ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇండియాలోనే లక్షలు, కోట్లు గడించే మార్గాలు అనేకమున్నాయి. అమెరికాలో ఉన్నది, ఇక్కడ లేనిది నిజానికి పెద్దేవీ లేవు. 

అన్నిటికంటే పెద్ద విషయం- మెడికల్ కేర్. అమెరికాలో కంటే ఇండియాలో హాస్పిటల్స్, ట్రీట్మెంట్, ధరల వెసులుబాటు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆరోగ్యశ్రీలు అన్నీ అమెరికాకంటే ఎన్నో రెట్లు నయమంటారు రెండు దేశాల్లోని పరిస్థితులు చూసినవాళ్లు. 

ఇంత చెప్పుకున్నాక లండన్ గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. ఈ మధ్యన వార్తల్లోకెక్కిన ఒక విషయం- లండన్లో ఇళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థులకష్టాల గురించి. 

అన్ని కాలేజీలకి హాస్టల్స్ ఉండవు. బయట ఎకామడేషన్లో ఉండాలి. 20 మంది విద్యార్థులు ఒకే గదిలో కుక్కుకుని బతుకున్నారనే వార్త దయనీయమనిపించింది. అక్కడున్న ఒక చట్టమేంటంటే, ఏ ఇంగ్లాండ్ పౌరుడైనా ఉద్యోగం కోల్పోయో, రెంట్ కట్టలేకనో, సొంత ఇల్లు లేకనో రోడ్డున పడితే వాళ్లకి ఇంగ్లాండ్ ప్రభుత్వం సొంత ఖర్చుతో నివాసాలు చూపించాలట. ఈ లెక్కలో ఉన్నవాళ్లు పెరిగి ఆ దేశంలో అద్దెకు ఇళ్లే దొరకని పరిస్థితి వచ్చింది. 

అమెరికాలోనే ఉద్యోగాల్లేవంటే ఇక ఇంగ్లాండు పరిస్థితి చెప్పక్కర్లేదు. అక్కడ అవకాశాలు చాలా తక్కువ.  

కేవలం డబ్బొస్తుంది కదా అని అమెరికా, ఇంగ్లాండులు విద్యార్థులకి ఎడ్మిషన్స్ ఇస్తున్నాయి తప్ప వాళ్లకి తర్వాత ఉద్యోగాలిచ్చి పోషించడానికి మాత్రం కాదనే సత్యాన్ని గ్రహించాలి. 

ఇప్పటికైనా తెలుగు విద్యార్థులు అమెరికా-ఇంగ్లాండ్ కలలు తగ్గించుకుని ఉన్న దేశంలోనే కొత్త ఆలోచనలతో ఎలా ఎదగాలో ప్లాన్ చెసుకోవడం మంచిది. 

స్టార్టప్స్ కి, ఇనోవేషన్స్ కి ఇప్పుడు ఇండియా పెద్ద పీట వేస్తోంది. యువత ఆ దిశగా ఆలోచించాలి. ప్రతి వారిలోనూ అంతటి తెలివి, తెగువ, దూసుకుపోయే తత్వం ఉండకపోవచ్చు. కానీ వాటిల్లో ఏదో ఒకటి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలా విభిన్న శక్తులు, యుక్తులు కలిగిన ముగ్గురు నలుగురు స్నేహితులు కలిసి కూడా కొత్తగా ఏదైనా ప్రారంభించవచ్చు. ఈ ఆన్లైన్, డిజిటల్, ఏ ఐ యుగంలో ఉన్న చోటునే మహరాజులు కావొచ్చు. పాత రోజుల్లోలాగ విదేశాలకి వలస పోనక్కర్లేదు.

ఈ విషయాన్ని విద్యార్థులతో పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా గ్రహించాలి.  

శ్రీనివాసమూర్తి