తెలంగాణలో సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ దర్యాప్తు చేస్తున్న ఈ దశలో తాము సీబీఐ విచారణకు ఆదేశించలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం గమనార్హం. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఎన్ఎస్‌యూఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ సందర్భంగా హైకోర్టు సీబీఐ విచారణకు నిరాకరించింది. సిట్ దర్యాప్తు సంతృప్తికరంగా సాగుతోందని, అయితే ఈ దశలో సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే విచారణ వేగంగా సాగడం లేదన్నారు.
ఈ కేసు ఎంత కాలం సాగుతుందని హైకోర్టు ప్రశ్నించింది. ఎంత మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పరీక్ష రాశారు? వారిలో ఎంత మంది అనుమతి తీసుకున్నారు? అలాగే వారిలో ఎందర్ని విచారించారని సిట్ దర్యాప్తు అధికారిని హైకోర్టు ప్రశ్నించింది.
సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉందని కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. డబ్బులు పెట్టి పేపర్ కొన్న వాళ్లు మళ్లీ ఎవరికైనా అమ్మారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో స్టేటస్ రిపోర్ట్‌ను జూన్ 5 వ తేదీ నాటికి సమర్పించాలని, ఆ రోజుకు కేసును వాయిదా వేసింది. దీంతో సీబీఐ విచారణపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ ఎదురైంది.