హిట్ 2 – ది సెకెండ్ కేస్ అనే సినిమా గుర్తుందా.. అందులో ఓ సైకో గాడు ఉంటాడు. అమ్మాయిల్ని కిరాతకంగా చంపేస్తుంటాడు. ఒకరి బాడీ పార్టుల్ని మరొకరికి తగిలించి దారుణంగా హత్యలు చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటి సీన్ తాడేపల్లిగూడెంలో రిపీట్ అయింది.
భార్యను హత్య చేసిన భర్త, ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి 2 ముక్కలు చేశాడు. ఓ చేయి నరికి, మరో చేతిలో పెట్టాడు. ఇలా అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది.
వీరపాలెంలో దావీద్, నిర్మల దంపతులు ఉండేవారు. వాళ్లకు పదేళ్ల లోపు పిల్లలు ముగ్గురున్నారు. కాపురం చేసి పిల్లల్ని కన్నారు కానీ, ఆలుమగల మధ్య సఖ్యత మాత్రం ఎన్నడూ లేదు. నిత్యం కొట్టుకోవడం తిట్టుకోవడం. దీంతో నిర్మల భర్తను వదిలేసింది. పిల్లల్ని పుట్టింట్లో ఉంచి, ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిపోయింది.
దుబాయ్ లో సంపాదించిన డబ్బును పుట్టింటికి పంపిస్తోంది కానీ భర్తకు మాత్రం పంపించడం లేదు. దీంతో దావీద్ కు కోపం, పగ ఎక్కువయ్యాయి. డబ్బులు ఇవ్వాలంటూ పిల్లల్ని హింసించేవాడు, ఆ వీడియోల్ని భార్యకు పంపించేవాడు. పిల్లల్ని హింసించే వీడియోలు వైరల్ అయి, పోలీసులు దావీద్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు నిర్మల తన పుట్టింటికి వచ్చింది. 2 నెలల కిందట జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాడు దావీదు. తాను మారిపోయానంటూ భార్యను నమ్మించాడు. భర్త మాటల్ని నమ్మింది నిర్మల.
3 రోజుల కిందట వీరపాలెంలోని భర్త ఇంటికి వెళ్లింది. నిన్న ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈసారి దావీదు సైకోగా మారాడు. భార్యను హత్య చేశాడు. ఆమె తలను 2 ముక్కలు చేశాడు. చేయి నరికి, మరో చేయిలో పెట్టాడు. ఈరోజు పొద్దున్న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.