Advertisement

Advertisement


Home > Movies - Reviews

Agent Review: మూవీ రివ్యూ: ఏజెంట్

Agent Review: మూవీ రివ్యూ: ఏజెంట్

చిత్రం: ఏజెంట్
రేటింగ్: 2/5
తారాగణం: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, విక్రంజీత్, ఊర్వశి రౌతేలా తదితరులు
కెమెరా: రసూల్ ఎల్లోర్, జార్జ్ సి విలియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: హిప్ హాప్ తమిళన్, భీమ్స్  
నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపా రెడ్డి
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: 28 ఏప్రిల్ 2023

ఎపుడో 2020 లో అనౌన్స్ అయ్యి, కరోనా విఘ్నాలను దాటుకుంటూ, హంగేరీ వరకు వెళ్లి మరీ షూటింగ్ చేసుకుని, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వాళ్లకి నీరసం తెప్పించి ఎట్టకేలకి నేడు విడుదలయ్యింది "ఏజెంట్". ట్రైలర్ చూడగానే ఇన్నాళ్ల వెయిటింగ్ కి అర్ధముందనిపించేలా ఉంది. పెద్ద స్కేల్లో చాలా శ్రద్ధగా టార్గెట్ ఆడియన్స్ కి నచ్చేలా ఏదో తీసారనిపించింది. ఇంతకీ ఆ అంచనాలని ఈ చిత్రం అందుకుందో లేదో తెలుసుకునేందుకు విషయంలోకి వెళ్దాం. 

కథలోకి వేళితే...హ్యాకింగులో నిపుణుడైన మన హీరో రిక్కీకి (అఖిల్) స్పై అవ్వాలని కోరిక. దానికోసం మిలిటరీ ఇంజనీరింగ్ పరీక్షలు రాసి ఇంటర్వ్యూల దాకా వెళ్తుంతాడు. కానీ అతనిని కొన్ని కారణాల వల్ల సెలెక్ట్ చెయ్యరు. మొత్తానికి తానే ఏదో ఒకటి చేసి ఆ జాబ్ సంపాదించాలనుకుని తన తెలివిని వాడి "రా" లో సీనియర్ అయిన డెవిల్ (మమ్ముట్టి) దృష్టిని ఆకర్షిస్తాడు. జాబ్ ఇవ్వకపోయినా తన ట్యాలెంట్ ని గట్స్ ని నమ్మి ఒక ముఖ్యమైన ఆపరేషన్ అప్పజెప్పాలనుకుంటాడు డెవిల్. ఆ ఆపరేషన్ గాడ్ (డినో మోరియా) ని పట్టుకోవడం. అయితే అతను తన ప్రేమను త్యాగం చేసి గర్ల్ ఫ్రెండ్ ని వదిలేసి వస్తేనే ఆ పని అప్పచెబుతానంటాడు. అప్పటికే తనకి పరిచయమయ్యి, ప్రేమగా మారిన అమ్మాయిని తనకిష్టమైన పని కోసం మన హీరో వదిలేస్తాడా? లేదా? ఇదొక ట్విస్ట్. తర్వాత డెవిల్ చెప్పినట్టు కాకుండా తనకిష్టమొచ్చిన రీతిలో ఆపరేషన్ చేస్తుంటాడు. దాని పర్యవసానాలు ఏమిటి? చివరికి ఏమౌతుంది? ఇదీ కథ. 

కథ పిసరంతే అయినా గ్రాండ్ స్కేల్లో తీసేస్తే జనం చూసేస్తారన్న అభ్రిప్రాయంతో ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఎక్కడా ఎమోషనల్ గ్రాఫ్ కానీ, నేచురల్ ఫ్లో గానీ, పొందికైన కథనం కానీ, హత్తుకునే సంభాషణలు కానీ లేకుండా భారీ ఖర్చుతో తెరమీదకెక్కిన చిత్రమిది. 

సాధారణంగా కొన్ని సినిమాలు ఎంత నచ్చకపోయినా ఏదో ఒక వర్గం ప్రేక్షకులకి ఎక్కుతుందేమో అనే అనుమానాలొస్తుంటాయి. కానీ ఇక్కడ ఏమాత్రం ఆ అనుమానాలకి తావివ్వకుండా ఏకగ్రీవంగా ఫలితమేంటో చెప్పేసేలాగ ఉందిది. ఆ విషయంలో దర్శకుడు పెద్దగా పని పెట్టలేదు. ఎక్కడో ఏదో మిరకిల్ జరిగితే తప్ప ఈ ప్రెడిక్షన్ తేడా కొట్టదు. 

కిక్, రేసుగుర్రం లాంటి సినిమాలు తీసిన సురేందర్ రెడ్డేనా ఈ సినిమా తీసింది అన్న డౌటొస్తుంది చాలా సార్లు. ఆయన తీసిన ఫ్లాపు సినిమాలు కూడా ఎంతోకొంత అర్ధవంతంగా ఉంటాయి. ఇది మాత్రం అలా లేదు. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క లైటర్ మొమెంట్ కూడా లేని సినిమాని ఈ దర్శకుడి నుంచి ఆశించం. రేసుగుర్రంలోనూ, దీంట్లోనూ కామన్ గా ఉన్నదేంటంటే డబ్బుల కంటైనరు మాత్రమే. 

కమెర్షియల్ సినిమా అంటే నాన్-స్టాప్  యాక్షన్ ఒకటే కాదు కదా! పాటల ద్వారాగానీ, ఎవో కొన్ని మొమెంట్స్ వలన కానీ కొన్ని సినిమాలు కథా కథనాలు ఎలా ఉన్నా లాగేస్తాయి. ఇది వాటికి భిన్నం. 

రా ఏజెంట్ అవ్వాలని ఇంటర్వ్యూల దాకా వెళ్లి మూడు సార్లు రిజెక్టయ్యి నాలుగోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ పట్టాలని ప్రయత్నిస్తుంటాడు హీరో. అది చూస్తుంటే అఖిల్ అక్కినేని కెరీర్ కళ్ల ముందు మెదులుతుంటుంది. వరుస ఫ్లాపులతో కింద మీద పడుతూ కెరీర్ లో ఇప్పటి వరకు హిట్టు రుచి చూడకుండా సాగుతున్న అఖిల్ కి ఇది కూడా చేదు రుచినే మిగిల్చేలా ఉంది. 

టెక్నికల్ గా చిత్రంలో భారీతనమంతా కెమెరా వర్క్ లోనూ, వీ.ఎఫ్.ఎక్స్ లోనూ కనిపిస్తుంది. కష్టమంతా అఖిల్ బాడీని చెక్కుకున్న తీరులో కనిపిస్తుంది. ఈ చిత్రంపై పాజిటివ్ గా స్పందించాలంటే అవి అయినా ఉన్నాయని సంతృప్తి చెందాలి. 

పాటలు విడిగా కాస్త పర్వాలేదనిపించినా సినిమాలో అవి వచ్చే రాంగ్ ప్లేస్మెంట్స్ కారణంగా దారుణంగా విసిగిస్తాయి. మరీ ముఖ్యంగా "రామ..కృష్ణా.." పాట, ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్ ఉన్నపళంగా ఊడిపడి నాన్ సింక్ లాగ అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బానే ఉంది. ఎడిటర్ చాలా కత్తెర్లు వేసినట్టు తెలుస్తూనే ఉన్నా ఇంకొన్ని కత్తెర్లు పడున్నా నష్టం లేదనిపిస్తుంది. 

ప్రధమార్ధం అయోమయంగా ఉంటే, ద్వితీయార్థం గందరగోళంగా మారింది. ఇంటర్వల్లో వేసిన "రామబాణం" ట్రైలర్ కాస్తంత రిలీఫ్ ఇచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

అఖిల్ కొత్తగా ట్రై చేసి చాలా వైల్డ్ గా నటించే ప్రయత్నం చేసాడు. నటనలో కనబరిచిన ఎనెర్జీ బాగుంది. సరైన కథ, కథనం పడుంటే బాగుండేది. అవి లేక అతని కష్టం ఎడారిలో పడిన వర్షమయ్యింది. 

హీరోయిన్ చూడ్డానికి బాగుంది. కానీ కథకి కావాల్సిన ఎమోషనల్ గ్రాఫ్ కోసం ఆమెను సరిగా వాడుకోలేదు దర్శకుడు. 

మమ్ముట్టిది ఇందులో ప్రధాన పాత్ర. తెలివిగా కనిపిస్తూనే దేశభక్తి పేరుతో మొండిగా తనకి తాను ముగింపు పలుక్కునే పాత్ర. 

విలన్ గా డినో మోరియా డబల్ షేడ్ లో బాగానే కనిపించాడు. కానీ చాలా రొటీన్ గా ఎండయ్యే క్యారెక్టర్ అతనిది. 

ఇక వరలక్ష్మి శరత్ కుమార్, అనీష్ కురువెల్ల కాస్త తెలిసిన మొహాలుగా కనిపించినా వాళ్లు జస్ట్ ప్యాడింగ్ ఆర్టిస్టుల మాదిరిగా ఉన్నారంతే. మురళీశర్మ మొదట్లో కాసేపు ప్రామిసింగ్ గా కనిపించి క్రమంగా మాయమైపోయాడు. సంపత్ కూడా అంతే. ఇలా వచ్చి అలా పోయే పాత్ర. 

మిగిలిన నటీనటులంతా కొత్తమొహాల్లాగే ఉన్నారు. 

సెకండాఫులో ఒకచోట ఒక క్యారెక్టర్ విలన్ తో, "ఈ మాత్రం దానికి మమ్మల్ని కిడ్నాప్ చెయ్యాలా సార్" అంటాడు. అప్పుడు చూస్తున్నవాళ్లకి "ఈ మాత్రం దానికి సినిమా తీసి ఆశపెట్టి ఇలా హల్లో కిడ్నాప్ చేసి కూచోపెట్టాలా సార్?" అని దర్శకుడిని అడగాలనిపిస్తుంది. 

క్లైమాక్స్ అయితే రొట్టకొట్టుడుకి పరాకాష్ట. 6 నిమిషాల్లో సుమారు ఒక పది నగరాలు బ్లాస్ట్ అయిపోయేలా విలన్ ఒక ప్రోగ్రాం సెట్ చేస్తాడు. హీరోగారు దానిని ఆపాలి. ఈ లోగా భయంకరమైన ఫైటు, హీరో రక్తమోడి స్పృహతప్పి పడిపోయి సరిగ్గా 30 సెకండ్ల టైం మిగిలి ఉందనగా లేస్తాడు. ఆ టైములో ఒక ప్రేక్షకుడు, "ఆపొద్దు బాబు! ఆ బాంబేదో మన నెత్తి మీద పడనీ!" అన్నాడు. అంటే ఈ సినిమా చూడ్డం కంటే బాంబు దాడికి గురవ్వడం బెటరన్నట్టే కదా! తెర మీద పరిస్థితి అలా ఉంటే హాల్లో ప్రేక్షకుల నిట్టూర్పులే నవ్విస్తాయి మరి.

హృదయం లేని కథకి, వెన్నెముక లేని కథనానికి ఖరీదైన బట్టలు తొడిగితే "ఏజెంట్". 

బాటం లైన్: ఖరీదైన తప్పిదం

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా