పదేళ్ల క్రితం నటి జియాఖాన్ మృతి కేసులో… ఇవాళ ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నది కూడా నటుడు కావడమే. నటి మృతికి నటుడు సూరజ్ పంచోలీకి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. దీంతో పదేళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణకు ముగింపు పలికినట్టైంది.
ఇంగ్లీష్-అమెరికన్ నటిగా నఫిసా రిజ్విఖాన్ అలియాస్ జియాఖాన్ పేరు తెచ్చుకున్నారు. ఈమె న్యూయార్క్‌లో పుట్టి పెరిగారు. బాలీవుడ్‌లో ఆమె నటించింది మూడు చిత్రాలే అయినప్పటికీ, అవి విజయవంతం కావడంతో జియాఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2012 సెప్టెంబర్ నుంచి జియాఖాన్ , సూరజ్ రిలేషన్‌లో ఉన్నారు. 2013, జూన్ 3న ముంబైలో తన నివాసంలో 25 ఏళ్ల జియాఖాన్ అచేతనావస్థలో కనిపించారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి ఆమె ఆత్మహత్యకు నటుడు సూరజ్ పంచోలి ఉసిగొల్పాడని కేసు నమోదు చేశారు. ముంబై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
అయితే తన కుమార్తెది హత్య అని జియాఖాన్ తల్లి రబియాఖాన్ సంచలన ఆరోపణ చేశారు. తన కూతురిని అన్ని రకాలుగా సూరజ్ హింసించాడని ఆమె వాపోయారు. సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆమె న్యాయపోరాటం చేశారు. చివరికి సీబీఐ దర్యాప్తు చేయాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. 2014లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. దాదాపు 9 ఏళ్ల పాటు సీబీఐ విచారణ చేసింది.
ఇటీవలే ఇరుపక్షాల వాదనలు సీబీఐ కోర్టులో ముగిశాయి. ఇవాళ సీబీఐ కోర్టు నటుడు సూరజ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించడం గమనార్హం. జియాఖాన్ మృతికి సూరజ్ కారణమని నిరూపించే సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.