విశాఖ ఆర్కే బీచ్‌లో ఐదు నెలల గర్భిణీ శ్వేత అనుమానాస్పద మృతికి సంబంధించిన సంచలన విషయాలు బయటికొస్తున్నారు. శ్వేత ఆడబిడ్డ భర్త సత్యం లైంగిక వేధింపులే తన కుమార్తె శ్వేత ఆత్మహత్యకు దారి తీసినట్టు మృతురాలి తల్లి రమ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్టైంది.
పోస్టుమార్గం అనంతరం శ్వేత మృతదేహాన్ని తల్లి రమ, బంధువులకు విశాఖ మూడో పట్టణ పోలీసులు అప్పగించారు. అనంతరం గురువారం శ్వేత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆడబిడ్డ భర్త లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని భర్త మణికంఠ దృష్టికి శ్వేత తీసుకెళ్లినట్టు ఆమె అమ్మ రమ తెలిపారు. అయితే ఇంటి విషయాలు బయటికి చెప్పొద్దని శ్వేతను భర్త వారించాడన్నారు. అంతేకాకుండా, ఆడబిడ్డ భర్త సత్యంకు శ్వేతతో భర్త క్షమాపణలు చెప్పించాడని ఆమె వాపోయారు. అత్తమామల ప్రోత్సాహంతోనే శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మృతురాలి తల్లి పేర్కొనడం గమనార్హం.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు శ్వేత భర్త, ఆడబిడ్డ భర్త సత్యం, అత్తమామలు, ఆడపడుచులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. శ్వేత మృతి వెనుక నిజాలను నిగ్గు తేల్చేందుకు అన్ని రకాలుగా దర్యాప్తు వేగవంతం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఏపీలో సంచలనం రేకెత్తిస్తున్న శ్వేత మృతిపై వాస్తవాలు వెలుగు చూడాల్సిన అవసరం వుంది.