ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చిన నాయకులంతా కలిసి… ఆ దివంగత నేత శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రజినీకాంత్‌కు హిందూపురం ఎమ్మెల్యే, దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు.
ఇదిలా వుండగా శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలకు సంబంధించి రెండు పుస్తకాల విడుదల చేయనున్నారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ ప్రసంగాలు, అలాగే ప్రజల్ని ఉద్దేశించి వివిధ సందర్భాల్లో ఆయన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ చారిత్రక ప్రసంగాల్లో ఎన్టీఆర్ చివరి రోజుల్లో తన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడవడంపై విడుదల చేసిన వీడియోలోని అంశాలు ఉంటాయా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “జామాతా దశమగ్రహ” పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న ఆ ప్రసంగం ఎన్టీఆర్ చేసిన అన్ని స్పీచ్‌లలో కంటే గొప్పదనే అభిప్రాయం వుందని నెటిజన్లు గుర్తు చేయడం విశేషం.
చంద్రబాబు నైజాన్ని, అల్లుడి అసలు స్వరూపాన్ని కళ్లకు కట్టిన ఎన్టీఆర్ ప్రసంగం…ఈ చారిత్రక పుస్తకాల్లో లేకపోతే పెద్ద లోటే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు, నమ్మిన వాళ్లను వంచించే నైజం గురించి పిల్లనిచ్చిన మామగా ఎన్టీఆర్ చెప్పిన విషయాలకు చాలా ప్రాధాన్యం వుంటుందని, తాజా చారిత్రక ప్రసంగ పుస్తకాల్లో తప్పకుండా ఆయన చివరి రోజుల్లో మాట్లాడిన అంశాలను పొందుపరిచి వుంటారని ఆశిద్దాం అంటూ నెటిజన్లు వెటకరిస్తూ కామెంట్స్ చేయడం విశేషం. ఇలా చారిత్రక పుస్తకాలపై నెటిజన్లు తమదైన రీతిలో చురకలు అంటిస్తున్నారు.