తాము సెలబ్రిటీ అయిపోవాలని, ప్రజలందరూ తమను గుర్తించి గౌరవిస్తుండాలనే కోరిక బహుశా ప్రతి ఒక్కరికీ ఉంటుందేమో. అయితే వారి రంగాల్లో చేసే కృషి, పడే కష్టం, కాలం కలిసి రావడం బట్టి మాత్రమే సెలబ్రిటీలు తయారవుతుంటారు.
అయితే ఇలా హఠాత్తుగా సెలబ్రిటీలు కావడానికి కొన్ని దొంగమార్గాలు కూడా ఉంటాయి. ఏపీలోని రాజకీయ నాయకుల్లో నడమంత్రపు హోదాలు కోరుకునే వారికి, సెకండ్ గ్రేడ్ లీడర్లుగా ఏదో మొక్కుబడి పదవులు పట్టుకుని వేళ్లాడుతున్న వారికి హఠాత్తుగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చేయడానికి ఇప్పుడొక రాచమార్గం తయారయింది. వారు ఏ చెత్త మాట్లాడినా సరే.. అగ్ర దినపత్రికలో పేజీలకొద్దీ ప్రచురించాలంటే, అగ్ర టీవీ ఛానెల్లో నిమిషాల కొద్దీ చూపించాలంటే.. సులువైన టెక్నిక్ తెలుసుకున్నారు. మామూలుగా ఇలాంటి రాచమార్గాలను రెడ్ కార్పెట్ వే అని అంటాం. కానీ ఇక్కడ అది యెల్లో వే… పచ్చమార్గం.
తెలుగుదేశం మరియు దాని అనుకూల దళాలు, వర్గాలకు చెందిన ఎవరైనా సరే.. హఠాత్తుగా ఇక్కడ సెలబ్రిటీ అయిపోవచ్చు. ఈ అవకాశం కొద్దికాలమే.. మంచి తరుణం మించిన దొరకదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అదేమిటంటే.. మార్గదర్శి సంస్థను, వారి నిజాయితీని, రామోజీరావు గొప్పదనాన్ని కీర్తించడం మాత్రమే. మార్గదర్శి చేస్తున్న అరాచక ఆర్థిక వ్యవహారాలు, దందాల గురించి ఏపీసీఐడీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక నిర్ఘాంత పోయే వాస్తవాలు బయటపడుతున్నప్పటికీ.. ఆ సంస్థను భజన చేస్తే ఈనాడు దినపత్రికలో వారికి బీభత్సమైన కవరేజీ వస్తుంది.
తొలుత ఇది కాస్త రివర్సులో ఉండేది. మార్గదర్శి మీద సీఐడీ దాడులు మొదలైన నాటినుంచి.. ఈనాడు వాళ్లే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను బతిమాలుకుని, మార్గదర్శికి అనుకూలంగా స్టేట్ మెంట్స్ ఇప్పించుకుని వాటిని చాలా పెద్ద వార్తలుగా ప్రచురించే వాళ్లు. ఆడిటర్లు, లాయర్లు, మాజీ అధికారులతో అభిప్రాయాలు వేసేవాళ్లు. ఈ టెక్నిక్ గమనించిన రాజకీయ మధ్యతరగతి నాయకులు కూడా కిటుకు పట్టుకున్నారు. మార్గదర్శిని భజన చేస్తున్నారు.
రామోజీరావు భజన చేయడం ద్వారా చంద్రబాబునాయుడును కూడా ప్రసన్నం చేసుకోవచ్చుననేది తెలుగుదేశం భజనగాళ్ల కోరిక. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రతి అడ్డమైన నాయకుడూ మార్గదర్శి భజనను ప్రారంభిస్తున్నారు.
మార్గదర్శి అనుకూల వాదనలతో సవాళ్లు విసురుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కి, జగన్మోహన్ రెడ్డికీ కూడా సవాళ్లు విసురుతున్నారు. నిజానికి ఉండవల్లి మార్గదర్శి సంస్థపై పోరాడిన అంశం వేరు. ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేస్తున్న యవ్వారం వేరు. అయినా సరే.. ఉండవల్లికి సవాలు విసిరితే తాము గొప్పవాళ్లు అయిపోతామనేది ఈ చిన్న నాయకుల కక్కుర్తిగా కనిపిస్తోంది.
ఇలా మార్గదర్శి భజనతో, పచ్చమార్గంలో, ఈనాడు లో పెద్ద కవరేజీ పొందినంత మాత్రాన ఇలాంటి అడ్డదారి నాయకులు నిజంగానే ప్రజల్లో సెలబ్రిటీ అవుతారా? అనేది ప్రశ్న!!