విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లాస్ట్ బెంచేనా అంటే ఇంటర్ రిజల్ట్స్ చూస్తే అదే అర్ధమవుతోంది. ఇంటర్ ఫలితాలలో ఏపీలో క్రిష్ణా జిల్లా 83 శాతంతో ఫస్ట్ ప్లేస్ ని అందుకోగా సాక్ష్తాత్తు విద్యా శాఖ మంత్రి సొంత జిల్లా విజయనగరం మాత్రం 57 శాతంతో సరిపెట్టుకుని లాస్ట్ బెంచ్ కి వెళ్ళింది.
ఏడాది క్రితం బొత్స విద్యా మంత్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నారు. గత ఏడాది టెన్త్ పరీక్షలలో పేపర్ లీకేజ్ వంటివి ఆయనకు ఇబ్బంది కలిగించాయి. ఈ ఏడాది మాత్రం పకడ్బంధీగా టెన్త్ పరీక్షలు నిర్వహించి భేష్ అనిపించుకున్నారు.
ఇంటర్ పరీక్షా ఫలితాలను రికార్డు టైం లో ప్రకటించి విద్యా మంత్రిగా మంచి మార్కులే తెచ్చుకున్నారు. సొంత జిల్లాలో మాత్రం రిజల్ట్స్ లో వెనకబడడం మైనస్ గా ఉంది. విద్యా మంత్రి సొంత జిల్లాలో సైతం మెరుగైన ఫలితాలను తీసుకునివస్తే బాగుంటుంది అన్న సూచనలు వెలువడుతున్నాయి.
విద్యా శాఖలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపడుతోంది. గతానికి భిన్నంగా వేల కోట్ల నిధులను వెచ్చిస్తోంది. ఈ కీలక సమయంలో సీనియర్ నేత బొత్స ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆయన ఆద్వర్యంలోనే 2024లో కూడా టెన్త్ ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఆ ఏడాదికి అయినా లాస్ట్ బెంచ్ నుంచి తన సొంత జిల్లాను ముందుకు తెస్తే బాగుంటుందని సూచనలు అందుతున్నాయి.